రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్:
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజూ రాణించాయి. అంతర్జాతీయ పరిస్థితులు సానుకూలంగా మారడం, చమురు ధరలు తగ్గుముఖం పట్టడం మదుపర్ల సెంటిమెంట్‌ను బలపరిచింది. అదేవిధంగా ఐటీ షేర్ల కొనుగోళ్ల మద్దతు సూచీలకు కలిసొచ్చింది. దీంతో దేశీయ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 579 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 169 పాయింట్లు పైకి ఎగబాకింది.
సెన్సెక్స్ ఉదయం 77,083.14 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 76,922.64) లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా సూచీ లాభాల్లోనే కదలాడింది. 77,578.93 పాయింట్ల వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి సెన్సెక్స్ 579.48 పాయింట్ల లాభంతో 77,502.12 వద్ద ముగిసింది. నిఫ్టీ 169.85 పాయింట్ల లాభంతో 24,175.70 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్30 సూచీలో ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్‌సీఎల్, బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. ఎల్‌అండ్‌టీ, మారుతీ, యాక్సిస్‌బ్యాంక్, రిలయన్స్, బీఈఎల్, కోటక్ బ్యాంక్ షేర్లు నష్టపోయాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95.40గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 70.54 డాలర్ల వద్ద ఉండగా, బంగారం ఔన్సు ధర 4,063 డాలర్ల వద్ద కొనసాగుతోంది.







