భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొత్త వాహనాలను ఆవిష్కరించడం మహీంద్రా& మహీంద్రా ఎన్నేళ్లుగా కొనసాగిస్తున్న సంప్రదాయం. అదే ధోరణిని 2026లోనూ కొనసాగించేందుకు కంపెనీ సన్నద్ధమవుతున్నట్లు ఆటోమొబైల్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15న కొత్త SUV మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురానున్నట్టు సంకేతాలు కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం మహీంద్రా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్, Vision S, BE 07 ఎలక్ట్రిక్ SUV వంటి పలు మోడళ్లను టెస్టింగ్ దశలో ఉంచింది. వీటిలో ముఖ్యంగా స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌కే ఆగస్టు 15 లాంచ్‌కు ఎక్కువ అవకాశాలు ఉన్నట్లు పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. 2022లో విడుదలైన స్కార్పియో Nకు ఇప్పటివరకు కేవలం స్వల్ప మార్పులే రావడంతో, ఇప్పుడు మిడ్-లైఫ్ ఫేస్‌లిఫ్ట్‌కు ఇది సరైన సమయంగా కంపెనీ చూస్తోందని విశ్లేషకులు చెబుతున్నారు.

కొత్త స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్‌లో బాహ్య రూపకల్పనలో గణనీయమైన మార్పులు ఉండే అవకాశం ఉంది. ముందుభాగంలో కొత్త గ్రిల్, తిరిగి రూపుదిద్దుకున్న బంపర్, అప్‌డేటెడ్ హెడ్‌ల్యాంప్స్‌ను అందించే అవకాశముందని సమాచారం. అలాగే కొత్త డిజైన్ అలాయ్ వీల్స్‌ను కూడా మహీంద్రా అందించవచ్చని ఆటో రంగం వర్గాలు అంచనా వేస్తున్నాయి. వెనుక భాగంలో కూడా స్వల్ప కాస్మెటిక్ అప్‌డేట్స్ వచ్చే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

క్యాబిన్‌లో మరింత ప్రీమియం అనుభూతిని కలిగించేలా పలు మార్పులు చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. పెద్ద 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు వంటి ఫీచర్లు కొత్త ఫేస్‌లిఫ్ట్‌లో లభించవచ్చని సమాచారం. ప్రస్తుతం టాప్ వేరియంట్లకే పరిమితమైన ADAS ఫీచర్లను మరిన్ని వేరియంట్లకు విస్తరించే అవకాశమున్నట్లు కూడా చర్చ నడుస్తోంది.

ఇంజిన్ పరంగా అయితే పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని అంచనా. ప్రస్తుతం స్కార్పియో Nలో లభిస్తున్న 2.2 లీటర్ల టర్బో డీజిల్, 2.0 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్లనే కొనసాగించే అవకాశముందని తెలుస్తోంది. ఈ ఇంజిన్లకు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికలు యథావిధిగా అందుబాటులో ఉండే అవకాశం ఉంది. ఎంపిక చేసిన కొన్ని వేరియంట్లలో ఫోర్ - వీల్ డ్రైవ్ వ్యవస్థను కూడా కొనసాగించే అవకాశముందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక మహీంద్రా విసిఒన్ S మార్కెట్‌లోకి రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశమున్నప్పటికీ, BE 07 ఎలక్ట్రిక్ SUVను కూడా ఆగస్టు 15న ఆవిష్కరించే అవకాశం ఉందన్న ప్రచారం ఆటో రంగంలో వినిపిస్తోంది. అయితే ఏ మోడల్‌ను ఆ రోజున అధికారికంగా పరిచయం చేయబోతున్నారన్న దానిపై కంపెనీ ఇప్పటివరకు ఎలాంటి ధృవీకరణ ఇవ్వలేదు.

మహీంద్రా నుంచి అధికారిక టీజర్లు, ప్రకటనలు వెలువడిన తర్వాతే ఆగస్టు 15న ఏ SUV మోడల్‌ను లాంచ్ చేయబోతున్నారన్నది స్పష్టతకు వచ్చే అవకాశం ఉంది. స్వాతంత్ర దినోత్సవం నాడు Mahindra ఏ కొత్త సర్‌ప్రైజ్ ఇవ్వబోతోందో తెలుసుకోవాలంటే ఆటో ప్రేమికులు మరికొన్ని రోజులు వేచి చూడాల్సి ఉంది.