రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్:
ప్రీమియం సెగ్మెంట్‌లోకి మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో + ప్రవేశం
ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ మోటోరొలా తన ఎడ్జ్ సిరీస్‌లో కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఎడ్జ్ 70 ప్రో+ పేరుతో ప్రీమియం విభాగంలో ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. శక్తివంతమైన బ్యాటరీ, అధునాతన కెమెరా సెటప్, తాజా ప్రాసెసర్ వంటి ఫీచర్లతో ఈ మోడల్‌ను అందుబాటులోకి తెచ్చింది.
మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో +లో 6.8 అంగుళాల 1.5K సూపర్ HD+ ఎక్స్‌ట్రీమ్ అమోలెడ్ క్వాడ్ కర్వ్‌డ్ డిస్‌ప్లేను అందించారు. 144Hz రిఫ్రెష్ రేటుతో పాటు 5,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కల్పించారు. డిస్‌ప్లే రక్షణ కోసం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ ఇచ్చారు.
బ్యాటరీ పరంగా ఈ ఫోన్‌లో 6500mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని ఏర్పాటు చేశారు. 90W వైర్డ్ టర్బో ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. దీర్ఘకాలిక వినియోగం, వేగవంతమైన ఛార్జింగ్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ స్పెసిఫికేషన్‌లను మోటోరొలా అందించింది.
కెమెరా విభాగంలో కూడా మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో +ను కంపెనీ హైఎండ్ సెగ్మెంట్‌కు తగ్గట్టుగా తీర్చిదిద్దింది. సోనీ LYT-710 సెన్సార్‌తో కూడిన 50MP ప్రధాన కెమెరాతో పాటు 50MP టెలిఫొటో కెమెరా, 50MP అల్ట్రావైడ్, మ్యాక్రో కెమెరాలను వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంది.
దృఢత్వం కోసం మిలటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో పాటు IP68, IP69 రేటింగ్‌లు ఈ ఫోన్‌కు లభించాయి. నీరు, దూళి వంటి వాటి నుంచి రక్షణ కల్పించేలా ఈ రేటింగ్‌లు ఉంటాయి.
సాఫ్ట్‌వేర్ పరంగా చూస్తే, ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత హలో UIపై నడుస్తుంది. మూడు ప్రధాన OS అప్‌డేట్స్, ఐదేళ్ల పాటు సెక్యూరిటీ అప్‌డేట్స్ అందించనున్నట్లు కంపెనీ ప్రకటించింది. పనితీరు కోసం మీడియా టెక్ డిమెంసిటీ 8500 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్‌ను ఉపయోగించారు.
ఆడియో అనుభవాన్ని మెరుగుపరచేందుకు డాల్బీ Atmos, హై రిజల్యూషన్ ఆడియో సపోర్ట్‌తో కూడిన స్టీరియో స్పీకర్లను ఈ ఫోన్‌లో అందించారు.
ధర విషయానికి వస్తే, మోటోరోలా ఎడ్జ్ 70 ప్రో + ఒక్క వేరియంట్‌లోనే మార్కెట్లోకి వస్తోంది. 12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్ ధరను కంపెనీ రూ.47,999గా నిర్ణయించింది. మూడు రంగుల ఎంపికలో ఈ ఫోన్ లభించనుంది.
యాక్సిస్ బ్యాంక్, ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు రూ.3 వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించారు. లేదా ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.3 వేల వరకు ప్రయోజనం పొందే అవకాశం ఉంది. జూన్ 11 నుంచి ఫ్లిప్కార్ట్ , మోటోరోలా అధికారిక వెబ్‌సైట్, సంబంధిత రిటైల్ స్టోర్లలో మోటోరోలా ఎడ్జ్ 70 Pro+ విక్రయానికి అందుబాటులోకి రానుంది.







