రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్: స్టాక్ ఎక్స్ఛేంజీల ద్వారా జరిగే ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ ప్రక్రియను మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మళ్లీ అమల్లోకి తెచ్చింది. 2025లో నిలిపివేసిన ఈ విధానాన్ని సవరించిన నిబంధనలతో ఆగస్టు 1 నుంచి తిరిగి ప్రారంభించనున్నట్లు సంస్థ ప్రకటించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం కంపెనీలు నిర్దిష్ట గడువులోపే బైబ్యాక్ పూర్తి చేయాల్సి ఉంటుంది.
సెబీ తాజా మార్పుల ప్రకారం, ఇకపై ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ ఆఫర్ ప్రారంభమైన రోజు నుంచి 66 పనిదినాల్లోపే బైబ్యాక్ ప్రక్రియను కంపెనీలు ముగించాలి. గతంలో ఈ గడువు ఆరు నెలలుగా ఉండేది. గడువును కుదించడం ద్వారా క్యాపిటల్ మార్కెట్ల సామర్థ్యాన్ని, పారదర్శకతను పెంచడమే లక్ష్యంగా సెబీ ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి.
ప్రస్తుతం అమల్లో ఉన్న బైబ్యాక్ విధానంలో కంపెనీలు ముందుగా నిర్ణయించిన ధర వద్ద తమ వాటాదారుల నుంచి షేర్లను తిరిగి కొనుగోలు చేస్తుంటాయి. అయితే ఓపెన్ మార్కెట్ బైబ్యాక్‌లో కంపెనీలు స్టాక్ ఎక్స్ఛేంజీలలో ఆ రోజు ఉన్న మార్కెట్ ధరలకే షేర్లను కొనుగోలు చేయగలుగుతాయి. కొత్త నిబంధనల ప్రకారం ఎలాంటి ప్రత్యేక బైబ్యాక్ విండో లేకుండానే రెగ్యులర్ ట్రేడింగ్ సెషన్‌లోనే షేర్లను తిరిగి కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది.
ఆఫర్ కాలంలో నిధుల వినియోగంపై కూడా సెబీ స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది. బైబ్యాక్‌కు కేటాయించిన మొత్తం నిధుల్లో కనీసం 40 శాతం నిధులను కంపెనీలు ఆఫర్ కాలంలోని మొదటి అర్ధభాగంలోనే వినియోగించాల్సి ఉంటుంది. దీంతో బైబ్యాక్ ప్రక్రియను చివరి దశకు వాయిదా వేయకుండా, సమయానికి అమలు చేసేలా కంపెనీలను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
పన్ను విధానంలోనూ కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో బైబ్యాక్ సమయంలో కంపెనీలపై పడే పన్ను భారాన్ని ఇప్పుడు వాటాదారులపైకి మార్చారు. దీనివల్ల ఓపెన్ మార్కెట్‌లో షేర్లు అమ్మినా, బైబ్యాక్ టెండర్ ఆఫర్ ద్వారా షేర్లు సమర్పించినా పన్ను విధానం ఒకేలా ఉండనుంది. ఈ మార్పుల గురించి కంపెనీలు తమ మదుపర్లకు ఈమెయిల్ లేదా ఎస్సెమ్మెస్ ద్వారా తప్పనిసరిగా సమాచారం అందించాలి.
బైబ్యాక్ ప్రతిపాదనల కోసం మర్చంట్ బ్యాంకర్‌ను నియమించాలనే నిబంధనను కూడా సెబీ తొలగించింది. దీంతో బైబ్యాక్ ప్రక్రియలో కంపెనీలకు వచ్చే అదనపు ఖర్చులు తగ్గే అవకాశం ఉంది. మొత్తం మీద ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ పునరుద్ధరణతో పాటు తీసుకొచ్చిన ఈ మార్పులు క్యాపిటల్ మార్కెట్లలో లిక్విడిటీ, సామర్థ్యాన్ని పెంచడంలో, మదుపర్లకు సమాన అవకాశాలు కల్పించడంలో దోహదపడతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.







