దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వరుసగా నాలుగోరోజూ బుధవారం రాణించాయి. మెటల్‌, పీఎస్‌యూ, కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ స్టాక్స్‌ సూచీలకు అండగా నిలిచాయి. వడ్డీ రేట్లపై అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ఈ రాత్రికి నిర్ణ్రం ప్రకటించనున్న వేళ మదుపర్లు అప్రమత్తత పాటించారు. ఈ క్రమంలోనే సెన్సెక్స్‌ 347.14 పాయింట్ల లాభంతో 77,155.62 వద్ద ముగిసింది. నిఫ్టీ 96.55 పాయింట్ల లాభపడి 24,085.70 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో ట్రెంట్‌, బీఈఎల్‌, ఎటర్నల్‌, టాటా స్టీల్‌, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభపడ్డాయి. బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, మారుతీ సుజుకీ షేర్లు నష్టాలు చవిచూశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 94.52గా ఉంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 79 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4329 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

  • టాటా మోటార్స్‌ పాసింజర్‌ షేర్లు అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి. ఓ దశలో 10 శాతం మేర క్షీణించాయి. చివరికి 8.10 నష్టంతో రూ.361.70 వద్ద ముగిశాయి. టాటా గ్రూపునకు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్‌ అయిన జాగ్వార్‌ ల్యాండ్‌ రోవర్‌ భవిష్యత్‌ వృద్ధి అంచనాలు, మేనేజ్‌మెంట్‌ కామెంటరీ టాటా మోటార్స్‌ షేర్లపై ప్రభావం చూపాయి.

  • ఐడీబీఐ బ్యాంక్‌ షేర్లు నేడు దూసుకెళ్లాయి. ఓ దశలో 18శాతం వరకు లాభపడ్డాయి. వ్యూహాత్మక వాటాల విక్రయానికి ప్రభుత్వం సిద్ధమవుతోందని, వచ్చే ఆర్థిక సంవత్సరానికల్లా పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ పూర్తవుతుందన్న వార్తల నేపథ్యంలో షేర్లు రాణించాయి. చివరికి 16 శాతం లాభంతో రూ.89.60 వద్ద ముగిసింది.