లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌

ఐటీ, హెల్త్‌ స్టాక్స్‌లో కొనుగోళ్లు..

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు ఈ వారాంతాన్ని లాభాలతో ముగించాయి. అంతర్జాతీయ మార్కెట్‌ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ.. ఐటీ, రియాల్టీ, ఫార్మా, హెల్త్‌కేర్‌ స్టాక్స్‌ సూచీలకు దన్నుగా నిలిచాయి. దీంతో సూచీలు వరుసగా మూడో రోజూ లాభపడ్డాయి.

సెన్సెక్స్‌ ఉదయం 78,152.34 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 77,502.12) లాభాల్లో ప్రారంభమైంది. ఆరంభంలో 600 పాయింట్ల మేర లాభాల్లో కదలాడిన సెన్సెక్స్‌.. మధ్యాహ్నం తర్వాత కాస్త క్షీణించింది. చివరికి 261.79 పాయింట్ల లాభంతో 77,763.91 వద్ద ముగిసింది. నిఫ్టీ 95.15 పాయింట్ల లాభంతో 24,270.85 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 95.22గా ఉంది.

సెన్సెక్స్‌ 30 సూచీలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టెక్‌ మహీంద్రా, భారతీ ఎయిర్‌టెల్‌, సన్‌ఫార్మా, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, ఎస్‌బీఐ, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్ ధర 71 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 4179 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.