అమెరికా ఔషధ సంస్థ ఆర్గానోన్ & కో కొనుగోలు కోసం సన్ ఫార్మా కు రుణాలు అందించనున్న అంతర్జాతీయ రుణదాతల బృందంలో స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కూడా చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. తన వంతుగా 1 బిలియన్‌ డాలర్లు, అంటే సుమారు రూ.9,500 కోట్ల రుణం ఇవ్వడానికి ఎస్‌బీఐ సూత్రప్రాయంగా అంగీకరించినట్టు ఆంగ్ల పత్రికలు వెల్లడించాయి.

ఈ ప్రతిపాదనకు ఎస్‌బీఐ బోర్డు ఆమోదం లభించాల్సి ఉంది. బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన వెంటనే, సన్ ఫార్మా కొనుగోలు ఒప్పందానికి నిధులు సమకూర్చే అంతర్జాతీయ రుణదాతల కన్సార్టియంలో ఎస్‌బీఐ అధికారికంగా భాగస్వామి కానుంది.

అమెరికాకు చెందిన ఆర్గానోన్ & కో సంస్థను 12 బిలియన్‌ డాలర్లకు, అంటే సుమారు రూ.1,15,000 కోట్లకు కొనుగోలు చేయడానికి సన్ ఫార్మా ఈ ఏడాది ఏప్రిల్‌లో ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ భారీ కొనుగోలుకు అవసరమైన నిధుల కోసం సిటీ గ్రూప్ , JP మోర్గాన్ , మిత్సుబిషి UFJ ఫైనాన్సియల్ గ్రూప్ లతో కూడిన విదేశీ రుణ సంస్థల బృందం సన్ ఫార్మా కు రుణాలు అందించేందుకు ముందుకొచ్చింది.

బోర్డు అనుమతి లభిస్తే, ఈ బృందంలో ఎస్‌బీఐ కూడా చేరి, దేశీయ బ్యాంకింగ్‌ వ్యవస్థ నుంచి కార్పొరేట్‌ కొనుగోళ్లకు నేరుగా నిధులు వెళ్లే మార్గం మరింత బలపడనుంది. కార్పొరేట్‌ కొనుగోళ్లకు దేశీయ రుణ సంస్థలు నిధులు సమకూర్చేందుకు రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ఈ ఏడాది ఫిబ్రవరిలో అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే.

ఎస్‌బీఐ సన్ ఫార్మా కు ఈ రుణాన్ని మంజూరు చేస్తే, ఆర్‌బీఐ తాజా అనుమతుల తర్వాత కార్పొరేట్‌ కొనుగోలు కోసం దేశీయ బ్యాంకు నుంచి వెలువడే తొలి పెద్ద రుణంగా ఇది నిలిచే అవకాశం ఉందని బ్యాంకింగ్‌ వర్గాలు భావిస్తున్నాయి.

ఇంతకుముందు నియంత్రణ నిబంధనలు, ఆస్తుల నాణ్యతపై ఆందోళనలు వంటి కారణాలతో ఇలాంటి పెద్ద మొత్తాల కొనుగోలు రుణాల విషయంలో దేశీయ బ్యాంకులు సాధారణంగా దూరంగా ఉండేవి. ఫలితంగా అనేక భారతీయ కంపెనీలు తమ కొనుగోలు ప్రణాళికలకు అవసరమైన నిధుల కోసం షాడో రుణదాతలు, విదేశీ ఆర్థిక సంస్థలు లేదా ప్రభుత్వ, ప్రైవేట్‌ మూలధన మార్కెట్లపై ఆధారపడాల్సి వచ్చేది.

ఆర్‌బీఐ తాజా సడలింపుల నేపథ్యంలో ఎస్‌బీఐ ముందడుగు, భవిష్యత్తులో ఇతర దేశీయ బ్యాంకులు కూడా కార్పొరేట్‌ కొనుగోళ్లకు నేరుగా నిధులు సమకూర్చే దిశగా ఉత్సాహం చూపే అవకాశాలను పెంచుతుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.