ప్రముఖ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్‌ మోటార్‌ దేశీయ మార్కెట్లో తన తొలి విద్యుత్‌ కారు టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ ఎబెల్లా ను అధికారికంగా ఆవిష్కరించింది. మిడ్‌ సైజ్‌ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లోకి వచ్చిన ఈ కొత్త ఎలక్ట్రిక్‌ మోడల్‌ హ్యుందాయ్‌ క్రెటా ఎలక్ట్రిక్‌, ఎంజీ జడ్‌ఎస్‌, మారుతీ సుజుకీ ఈ-విటారా వంటి మోడళ్లకు పోటీగా నిలవనుంది.

మారుతీ సుజుకీ ఈ-విటారా ప్లాట్‌ఫామ్‌పై అభివృద్ధి చేసిన ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీకి టయోటా ప్రత్యేక డిజైన్‌ ఎలిమెంట్లను జోడించింది. ఎక్స్‌షోరూమ్‌ ధరను కంపెనీ రూ.23.60 లక్షలుగా నిర్ణయించింది. ధర పరంగా, ఫీచర్ల పరంగా ఈ మోడల్‌ మిడ్‌ సైజ్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ విభాగంలో కీలక ఎంపికగా నిలుస్తుందని ఆటో రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.

టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ ఎబెల్లా రెండు బ్యాటరీ వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. వీటిలో 49 kWh, 61 kWh సామర్థ్యాల బ్యాటరీలు ఉంటాయి. అధిక సామర్థ్యం గల 61 kWh బ్యాటరీ వేరియంట్‌ ఒకసారి పూర్తి ఛార్జ్‌తో 543 కిలోమీటర్లు ప్రయాణించగలదని కంపెనీ వెల్లడించింది. ఈ కారులో అమర్చిన ఎలక్ట్రిక్‌ మోటార్‌ గరిష్టంగా 172 బీహెచ్‌పీ శక్తి, 189 ఎన్‌ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బాహ్య రూపకల్పనలో 18 అంగుళాల అల్లాయ్‌ వీల్స్‌ను అందించారు. మొత్తం ఐదు మోనోటోన్‌, నాలుగు డ్యూయల్‌ టోన్‌ ఎక్స్‌టీరియర్‌ కలర్‌ ఆప్షన్లతో ఈ మోడల్‌ లభ్యమవుతుంది. వీటితో వినియోగదారులకు విస్తృత రంగుల ఎంపిక లభిస్తుందని కంపెనీ పేర్కొంటోంది.

క్యాబిన్‌ లోపల ఆధునిక ఫీచర్లను సమృద్ధిగా సమకూర్చారు. డ్రైవర్‌ కోసం 10.25 అంగుళాల డిజిటల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్‌, మధ్య భాగంలో 10.1 అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సిస్టమ్‌ వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్‌ ఆటో, యాపిల్‌ కార్‌ ప్లేకు సపోర్ట్‌ చేస్తుంది. పనోరమిక్‌ సన్‌రూఫ్‌, 12 కలర్‌ ఆప్షన్లతో యాంబియెంట్‌ లైటింగ్‌, వెంటిలేటెడ్‌ ఫ్రంట్‌ సీట్స్‌ వంటి సౌకర్యాలు కూడా ఉన్నాయి.

అదనంగా వైర్‌లెస్‌ ఫోన్‌ ఛార్జింగ్‌, జేబీఎల్‌ సౌండ్‌ సిస్టమ్‌, ఆటోమేటిక్‌ క్లయిమేట్‌ కంట్రోల్‌, మల్టిపుల్‌ యూఎస్‌బీ పోర్ట్స్‌, ఇన్‌-క్యాబిన్‌ ఎయిర్‌ప్యూరిఫైర్‌ వంటి ఫీచర్లను టయోటా అందిస్తోంది. భద్రత పరంగా స్టాండర్డ్‌గా 7 ఎయిర్‌బ్యాగులు అమర్చారు. అలాగే ఏబీఎస్‌, ఈబీడీ, ఈఎస్‌పీ, 360 డిగ్రీల కెమెరా, లెవల్‌-2 అడాస్‌ వంటి ఆధునిక భద్రతా సాంకేతికతలను ఈ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీలో సమకూర్చారు.