న్యూఢిల్లీ: మొబైల్‌ ఫోన్‌లో ఇంటర్నెట్‌ కనెక్టివిటీ లేకున్నా మర్చంట్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (పీఓఎస్‌) వద్ద యూపీఐ చెల్లింపులు చేసే సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. ప్రతిపాదిత విధానం ద్వారా కస్టమర్‌ ఫోన్‌, పీఓఎస్‌ టెర్మినల్‌ రెండింటికీ ఇంటర్నెట్‌ లేకున్నా లావాదేవీలు జరిపే అవకాశం కలగనుంది.

ఈ కొత్త ఫీచర్‌లో నియర్‌ ఫీల్డ్‌ కమ్యూనికేషన్‌ (ఎన్‌ఎఫ్‌సీ) టెక్నాలజీ కీలక పాత్ర పోషించనుంది. ఎన్‌ఎఫ్‌సీ సదుపాయం ఉన్న మొబైల్‌ ఫోన్‌ను పీఓఎస్‌ టెర్మినల్‌ వద్ద టాప్‌ చేయడం ద్వారా యూపీఐ లైట్‌ బ్యాలెన్స్‌ నుంచి గరిష్ఠంగా రూ.2,000 వరకు చెల్లింపులు చేయడానికి అవకాశం కల్పించనున్నట్టు తెలుస్తోంది. ఇంటర్నెట్‌ అందుబాటులో ఉండని విమాన క్యాబిన్లు, భూగర్భ రైలు నెట్‌వర్క్స్‌ వంటి వాతావరణాలను దృష్టిలో పెట్టుకుని ఈ ఫీచర్‌ను రూపకల్పన చేస్తున్నారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

ఈ విధానానికి అనుగుణంగా ప్రముఖ టెర్మినల్‌ తయారీ సంస్థలు అభివృద్ధి చేసిన పీఓఎస్‌ డివైజ్‌లను సర్టిఫై చేసే ప్రక్రియను ఈ ఏడాదిలోనే ఎన్‌పీసీఐ ప్రారంభించనున్నట్టు సమాచారం. ఆఫ్‌లైన్‌ యూపీఐ లావాదేవీలను అనుమతించేందుకు పీఓఎస్‌ కంపెనీలు ఎన్‌పీసీఐ నుంచి ప్రత్యేక సర్టిఫికేషన్‌ పొందాల్సి ఉంటుంది.

ఇంటర్నెట్‌ కనెక్టివిటీ ఉన్న సమయంలో కస్టమర్లు తమ మొబైల్‌ ఫోన్‌లోని యూపీఐ లైట్‌ వ్యాలెట్‌లో ముందుగా సొమ్మును లోడ్‌ చేసుకోవాలి. ఆ తర్వాత ఆఫ్‌లైన్‌ టెర్మినల్‌ వద్ద యూపీఐ పిన్‌ ఎంటర్‌ చేయకుండానే ఆ వ్యాలెట్‌లోని సొమ్ముతో చెల్లింపులు చేయవచ్చు. ఈ లావాదేవీల వివరాలను పీఓఎస్‌ టెర్మినల్‌ లోకల్‌గా స్టోర్‌ చేసుకుంటుంది. టెర్మినల్‌ ఇంటర్నెట్‌కు కనెక్ట్‌ అయిన వెంటనే ఆ డేటాను వెరిఫికేషన్‌ కోసం పంపించి లావాదేవీని ఫైనల్‌ చేస్తుంది.

బ్యాంకులు, థర్డ్‌ పార్టీ యూపీఐ అప్లికేషన్‌ ప్రొవైడర్లు తమ యాప్‌లలో ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురావడానికి అవసరమైన మార్పులు, సాంకేతిక సమన్వయం పనుల్లో నిమగ్నమై ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఫీచర్‌ అమల్లోకి వచ్చిన తర్వాత ఇంటర్నెట్‌ సమస్యలు ఉన్న ప్రాంతాల్లో చిన్న మొత్తాల డిజిటల్‌ చెల్లింపులు మరింత సులభతరం కానున్నాయని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి.