రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్: జర్మనీ కార్ల తయారీ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ భారీ పునర్‌వ్యవస్థీకరణకు సిద్ధమవుతోంది. ఈ ప్రక్రియలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా లక్ష మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికను కంపెనీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా, జర్మనీలోని నాలుగు తయారీ ప్లాంట్లలో ఉత్పత్తిని పూర్తిగా నిలిపివేయాలన్న ప్రతిపాదనలూ చర్చలో ఉన్నాయని జర్మన్ పత్రిక మేనేజర్ మ్యాగజైన్ ఒక కథనంలో వెల్లడించింది.
ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో సుమారు 6.67 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో దాదాపు 43 శాతం మంది జర్మనీలోనే ఉన్నారు. ప్రతిపాదిత ఉద్యోగ కోతలు అమల్లోకి వస్తే, మొత్తం ఉద్యోగుల్లో సుమారు 15 శాతం మందిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆ కథనం పేర్కొంది. ఈ కోతలు సీఈవో ఒలివర్ బ్లూమ్ రూపొందించిన ‘2030 గ్రూప్ టార్గెట్ పిక్చర్’ ప్రణాళికలో భాగమని మేనేజర్ మ్యాగజైన్ తెలిపింది.
ఇటీవల జరిగిన ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో ఈ ప్రతిపాదనలను యాజమాన్యం ముందుంచినట్లు సమాచారం. వచ్చే నెల జరగనున్న సూపర్‌వైజరీ బోర్డు సమావేశంలో కూడా ఈ అంశంపై విస్తృతంగా చర్చించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. భారీ ఉద్యోగ కోతలతో పాటు జర్మనీలోని హానోవర్, జ్విక్కావ్, ఎమ్డెన్, ఆడికు చెందిన నెక్సార్సల్మ్ ప్లాంట్లలో ఉత్పత్తిని నిలిపివేయాలని ఫోక్స్‌వ్యాగన్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
రాబోయే ఐదేళ్లలో పెట్టుబడి వ్యయాలను కూడా 15 శాతం మేర తగ్గించాలన్నది సీఈవో బ్లూమ్ లక్ష్యంగా పెట్టుకున్నారని ఆ కథనం పేర్కొంది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అయ్యే అధిక వ్యయాలు, చైనా కంపెనీల నుంచి వస్తున్న తీవ్రమైన పోటీ, అంతర్జాతీయ టారిఫ్‌ల ఒత్తిళ్లను తట్టుకోవడానికే ఈ కఠిన నిర్ణయాలు తీసుకునే దిశగా యాజమాన్యం అడుగులు వేస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు.
అయితే, ఫోక్స్‌వ్యాగన్ వర్క్స్ కౌన్సిల్, జర్మనీకి చెందిన ఐజీ మెటల్ యూనియన్ ఈ ప్రతిపాదనలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. యాజమాన్యం ఉద్యోగ కోతలు, ప్లాంట్ల మూతపెట్టే చర్యలకు వెళితే తమవంతు పోరాటాన్ని ముమ్మరం చేస్తామని యూనియన్లు హెచ్చరించినట్లు జర్మన్ మీడియా నివేదించింది.
ప్రస్తుతం ఫోక్స్‌వ్యాగన్ సుమారు 50 వేల ఉద్యోగాలను తొలగించే ప్రణాళికను అధికారికంగా ఉంచినట్లు సమాచారం. 2024లో కార్మిక సంఘాలతో కుదుర్చుకున్న ఒప్పందంలో దశాబ్దం పాటు ఏ ఒక్క ప్లాంట్‌ను మూసివేయబోమని కంపెనీ హామీ ఇచ్చింది. తాజా ప్రతిపాదనలు ఆ ఒప్పందానికి విరుద్ధంగా ఉండడంతో, కార్మిక సంఘాల నుంచి మరింత తీవ్ర ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఫోక్స్‌వ్యాగన్ గ్రూప్‌లో ఫోక్స్‌వ్యాగన్, ఆడి, పోర్షే, లాంబోర్గిని, బెంట్లీ వంటి పాసింజర్ వాహన బ్రాండ్లతో పాటు, స్కానియా, డుకాటీ వంటి కమర్షియల్, టూవీలర్ బ్రాండ్లు ఉన్నాయి. ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో కీలక స్థానంలో ఉన్న ఈ గ్రూప్‌లో ఇంత భారీ స్థాయిలో ఉద్యోగ కోతలు, ప్లాంట్ల మూతపెట్టే యోచన పరిశ్రమను ఉలిక్కిపడేలా చేసింది.







