రాయలసీమ న్యూస్, చిత్తూరు: చిత్తూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలనకు కట్టుబడి ఉందని, ఇప్పటివరకు హామీ ఇచ్చిన వాటిని అమలు చేశామని కూటమి పార్టీల ప్రజా ప్రతినిధులు పేర్కొన్నారు. శుక్రవారం చిత్తూరు నగరంలోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల మైదానంలో కూటమి ప్రభుత్వ సుపరిపాలన, రెండేళ్ల విజయోత్సవాల సందర్భంగా బహిరంగ సభ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి హాజరై ప్రసంగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి జెండాలు ఎగరాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. గ్రామ స్థాయి నుంచి వార్డు స్థాయి వరకు అభివృద్ధి వేగంగా సాగాలంటే కూటమికి విజయం తప్పనిసరి అని తెలిపారు. వైకాపా పాలనలో పెట్టుబడిదారులు రాష్ట్రం నుంచి వెళ్లిపోయారని విమర్శించారు.
మామిడి రైతుల ప్రయోజనార్థం తోతాపురి రకానికి కిలోకు రూ.4 ప్రోత్సాహకం అందిస్తున్నామని, ఈ ఏడాదికీ అదే విధంగా సహాయం కొనసాగుతున్నట్లు మంత్రి రాంప్రసాద్‌రెడ్డి వివరించారు. గత రెండేళ్లలో చిత్తూరు జిల్లాకు రూ.4 వేల కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చిత్రపటాలకు మంత్రి, ఎమ్మెల్యేలు, కలెక్టర్ క్షీరాభిషేకం చేశారు.
జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు పి.హరిప్రసాద్ మాట్లాడుతూ వైకాపా పాలనలో రాష్ట్ర ప్రజలు అనేక అరాచకాలు చూశారని పేర్కొన్నారు. గత రెండేళ్లలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్, మంత్రి లోకేశ్ సమన్వయంతో ప్రజలకు సుపరిపాలన అందుతున్నదని అభిప్రాయపడ్డారు. భాజపా జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్‌నాయుడు మాట్లాడుతూ ప్రధాని మోదీ సహకారంతో రాష్ట్రం అభివృద్ధి బాటలో పయనిస్తోందని తెలిపారు. ప్రజలు కోరిన పరిపాలనను కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అందిస్తున్నదని పేర్కొన్నారు.
కలెక్టర్ సుమిత్‌కుమార్ మాట్లాడుతూ గత రెండేళ్లలో 75 వేల మంది సమస్యలపై వినతులు స్వీకరించామని, వాటిలో చాలా వరకు పరిష్కరించామని తెలిపారు. జిల్లాలో వివిధ సంక్షేమ పథకాల ద్వారా రూ.4,500 కోట్లు అందించినట్లు వివరించారు. చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ కలెక్టర్ సహకారంతో చిత్తూరు నగరంలో రోడ్ల విస్తరణ పనులు పూర్తి చేశామని చెప్పారు. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధికి రూ.333 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.
పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో గత రెండేళ్లలో రూ.293 కోట్లు సంక్షేమానికి, రూ.700 కోట్లు అభివృద్ధికి ఖర్చు చేశామని వివరించారు. గతంలో ఏ ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువగా ఖర్చు చేసిందా అనే అంశంపై బహిరంగ చర్చకు సిద్ధమని సవాలు విసిరారు. సంక్షేమం, అభివృద్ధి రెండూ రాష్ట్ర ప్రభుత్వానికి సమాన ప్రాధాన్యం కలిగిన అంశాలుగా అమలవుతున్నాయని ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. పార్టీలకతీతంగా ప్రభుత్వ పథకాల ఫలాలు ప్రజలకు చేరుతున్నాయని, రాష్ట్ర జీడీపీలో రెండో స్థానంలో ఉందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో తెదేపా జోన్–4 సమన్వయకర్త దామచర్ల సత్య, చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ తెదేపా అధ్యక్షుడు షణ్ముగరెడ్డి, ప్రధాన కార్యదర్శి సునీల్‌కుమార్‌చౌదరి, చుడా ఛైర్‌పర్సన్ హేమలత, పీకేఎం ఉడా ఛైర్మన్ సురేష్‌బాబు, ఆర్టీసీ వైస్ ఛైర్మన్ మునిరత్నం, రాజ్యసభ మాజీ సభ్యురాలు దుర్గా రామకృష్ణ, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, మాజీ ఎమ్మెల్యేలు ఎ.ఎస్.మనోహర్, గాంధీ, సీఎం చంద్రబాబు పీఏ శ్రీకాంత్, యుగంధర్, వరుణ్‌కుమార్, త్యాగరాజన్‌తో పాటు పలువురు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.













