రాయలసీమ న్యూస్, చిత్తూరు: చిత్తూరు జిల్లాలోని జైన్ ఫ్యాక్టరీ వద్ద మామిడి రైతు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన కలకలం రేపింది. జీడీ నెల్లూరు మండలం బొమ్మవారిపల్లెకు చెందిన రైతు లోకేష్ నాయుడు సోమవారం సాయంత్రం ఫ్యాక్టరీ గేటు వద్ద ఒంటిపై డీజిల్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా, అక్కడే ఉన్న తోటి రైతులు అప్రమత్తమై అడ్డుకున్నారు. వెంటనే అతన్ని అక్కడి నుంచి దూరంగా తీసుకెళ్లి శాంతింపజేశారు.
స్థానిక సమాచారం ప్రకారం, జైన్ ఫ్యాక్టరీలో మామిడి కొనుగోలు ప్రక్రియలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణలతో రైతులు గత కొన్ని రోజులుగా అసంతృప్తిగా ఉన్నారు. అధికార పార్టీ నేతల సిఫార్సులతో అడ్డదారుల్లో మామిడి లోడ్ ట్రాక్టర్లు ఫ్యాక్టరీలోకి దిగుమతి అవుతున్నాయని, సాధారణ రైతులకు మాత్రం టోకెన్లు ఇవ్వకుండా వేచి పెట్టిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.
లోకేష్ నాయుడు నాలుగు రోజులుగా జైన్ ఫ్యాక్టరీ ఎదుట తన వంతు కోసం పడిగాపులు కాస్తున్నప్పటికీ, తనకు టోకెన్ నంబర్ కేటాయించలేదని కుటుంబ సభ్యులు, తోటి రైతులు తెలిపారు. ఈ నేపథ్యంలో తీవ్ర ఆవేదనకు గురైన అతను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు చెబుతున్నారు.
జైన్ ఫ్యాక్టరీ వద్ద ఇప్పటికే మామిడి దిగుబడులు తీసుకువచ్చిన అనేక మంది రైతులు టోకెన్ల కోసం క్యూల్లో నిలబడి ఉన్నారు. అయితే కొంతమంది మాత్రమే సిఫార్సులతో ముందుగా లోపలికి వెళ్లి మామిడి దిగజార్చుతున్నారని, తమ మామిడి పండ్లు పాడైపోతాయనే ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో లోకేష్ నాయుడు ఆత్మహత్యాయత్నం చేయడంతో అక్కడున్న రైతుల ఆగ్రహం మరింత పెరిగింది.
ఘటన తరువాత జైన్ ఫ్యాక్టరీ గేటు వద్ద రైతులు ఆందోళనకు దిగారు. మామిడి కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, టోకెన్ వ్యవస్థను న్యాయంగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అధికార పార్టీ నేతల జోక్యంతో అడ్డదారుల్లో ట్రాక్టర్లను లోపలికి అనుమతించడం వెంటనే నిలిపివేయాలని కోరారు.
సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు. రైతుల ఆందోళన నేపథ్యంలో జైన్ ఫ్యాక్టరీ నిర్వహణ, వ్యవసాయ శాఖ అధికారులు పరిస్థితిని సమీక్షిస్తున్నట్లు తెలిసింది. లోకేష్ నాయుడు ఆరోగ్య పరిస్థితి, అతనిపై నమోదయ్యే కేసుల వివరాలు ఇంకా వెల్లడికాలేదు.
ఈ ఘటనతో చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యలు, జ్యూస్ ఫ్యాక్టరీల కొనుగోలు విధానాలపై మరోసారి చర్చ మొదలైంది. రైతులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానిక రైతు సంఘాలు కోరుతున్నాయి.













