రాయలసీమ న్యూస్, చిత్తూరు: చిత్తూరు జిల్లా గుడిపాల మండలం తమిళనాడు సరిహద్దు వద్ద నిర్మాణంలో ఉన్న చర్చి స్లాబ్ కూలిన ఘటన కలకలం రేపింది. నూతనంగా నిర్మిస్తున్న చర్చి స్లాబ్ ఒక్కసారిగా కూలిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. శిథిలాల తొలగింపు, సహాయక చర్యలను అధికారులు ముమ్మరం చేశారు.
గుడిపాల మండలం మండికృష్ణాపురం కాలనీ సమీపంలో తమిళనాడు సరిహద్దు వద్ద ఈ చర్చి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. నిర్మాణ పనులు పూర్తయిన కొద్దిసేపటికే స్లాబ్ మొత్తం కూలిపోవడంతో అక్కడ పనిచేస్తున్న కార్మికులు శిథిలాల కింద చిక్కుకున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిసింది.
సుమారు 13 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానికులు, అధికార వర్గాలు తెలియజేశాయి. వారిలో 10 మందిని అంబులెన్సుల ద్వారా కాట్పాడికి తరలించినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన కాట్పాడికి చెందిన రాము (24), సురేష్ (40), దయాలన్ (60)లను మరింత మెరుగైన చికిత్స కోసం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది, విపత్తు నిర్వహణ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు. శిథిలాలను తొలగిస్తూ చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. భారీ యంత్రాలతో పాటు స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు.
చర్చి నిర్మాణ పనుల కోసం తమిళనాడు నుంచి పలువురు కూలీలు ఈ ప్రాంతానికి వచ్చినట్లు సమాచారం. ప్రమాద సమయంలో అక్కడ ఎంతమంది కార్మికులు పనిచేస్తున్నారన్న దానిపై స్పష్టత కోసం అధికారులు విచారణ జరుపుతున్నారు. నిర్మాణ నాణ్యత, సాంకేతిక లోపాలు, భద్రతా ప్రమాణాలపై కూడా సంబంధిత శాఖలు పరిశీలన ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ఈ ఘటనతో గుడిపాల, పరిసర ప్రాంతాల్లో విషాద వాతావరణం నెలకొంది. మృతుల గుర్తింపు, గాయపడిన వారి పూర్తి వివరాలు, ప్రమాదానికి గల కారణాలపై అధికారుల నుంచి మరిన్ని వివరాలు వెలువడాల్సి ఉంది.













