చిత్తూరు జిల్లా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహించిన సదరం శిబిరంలో వికలాంగ బాలికకు పింఛను మంజూరు చేయాలని ఒక తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టుకతోనే కుమార్తెకు మానసిక ఎదుగుదల లేకపోవడంతో పాటు నడవలేని స్థితి ఏర్పడిందని, తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆయన తెలిపారు.

బి.కొత్తకోట మండలం బడికాయలపల్లెకు చెందిన నరసింహులు తన కుమార్తెను సదరం శిబిరానికి తీసుకువచ్చారు. గత ఏడు వారాలుగా ఆటో బాడుగకు తీసుకుని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నప్పటికీ, వైద్యులు అందుబాటులో లేరనే కారణంతో తిరిగి పంపిస్తున్నారని ఆయన వాపోయారు.

నరసింహులు తెలిపిన వివరాల ప్రకారం, 2014లో కుమార్తె పుట్టింది. అప్పటి నుంచి ఆమె ఆరోగ్య సమస్యల పరిష్కారానికి వివిధ ఆసుపత్రులకు తిరుగుతున్నారని చెప్పారు. అయితే ఈ ఏడాది జనవరిలో సదరం ధ్రువపత్రం జారీ చేసినట్లు పేర్కొన్నారు. ఆ ధ్రువపత్రంలో బాలిక వికలత్వం 90 శాతం ఉందని నమోదు చేసినప్పటికీ, రూ.15 వేల పింఛను మంజూరు కావడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పింఛను మొత్తాన్ని పెంచేందుకు ఆసుపత్రికి రావాలని వైద్యులు సూచించడంతో, గత ఏడు వారాలుగా నిరంతరం ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నట్లు నరసింహులు తెలిపారు. అయితే ప్రతి సారి వైద్యులు లేరనే కారణంతో పని సాధ్యంకాకపోవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటోందని ఆయన పేర్కొన్నారు.

బుధవారం కూడా మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన నరసింహులకు, సంబంధిత వైద్యుడు సెలవులో ఉన్నట్లు ఆసుపత్రి సిబ్బంది తెలిపారు. దీంతో మరోసారి నిరాశతో తిరుగు ప్రయాణం కావాల్సి వచ్చింది. వికలాంగ బాలిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని, వెంటనే పింఛను మంజూరు చేసి ప్రభుత్వం సహాయం అందించాలని స్థానికులు కూడా అభిప్రాయపడుతున్నారు.