హంద్రీ–నీవా కాలువ ద్వారా కుప్పానికి కృష్ణా జలాలు చేరడంతో అధికార పార్టీ నాయకులు భారీ ఆర్భాటాలు చేశారు. నియోజకవర్గంలోని చెరువులన్నీ నింపి కుప్పం ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తామని హామీలు ఇచ్చారు. అయితే ఆ హడావుడి మూణ్ణాళ్ల ముచ్చటగానే మిగిలిపోయింది. కొద్దికాలానికే హంద్రీ–నీవా కాలువలో నీటి ప్రవాహం ఆగిపోయింది.

వర్షాలు కురవకపోవడంతో చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. భూగర్భ జలాలు బాగా పడిపోవడంతో బోర్లలో నీటి మట్టం తీవ్రంగా తగ్గింది. అనేక బోర్లలో నీరు రావడం మానేసింది. దీంతో పొలాలు బీళ్లుగా మారి పంటలు వేసే పరిస్థితి లేకుండా పోయిందని రైతులు చెబుతున్నారు. కుప్పం నియోజకవర్గంలో పెద్దగా నీటి వనరులు లేకపోవడం, పాలారు నది ఉన్నా దాని నీటిని వినియోగించుకోవాలన్న ఆలోచన పాలకులకు లేకపోవడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

హంద్రీ–నీవా కాలువ ద్వారా కుప్పం నియోజకవర్గంలో 92 చెరువులు నింపినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం ఒక్క చెరువులోనూ నీటి జాడ కనిపించడం లేదు. కాలువలో నీరు ప్రవహించినంతకాలం చెరువుల్లో కొంతమేర నీరు నిల్వ ఉండేది. కాలువలో ప్రవాహం ఆగిపోవడంతో చెరువుల్లోని నీరు కూడా క్రమంగా ఇంకిపోయింది.

వ్యవసాయ బోర్లు, రక్షిత మంచినీటి బోర్లలోనూ నీటి మట్టం గణనీయంగా తగ్గిపోయింది. సాధారణంగా జూలై నుంచి డిసెంబర్‌ వరకు వరి సాగు సీజన్‌గా ఉంటుంది. ఈ సీజన్‌ ప్రారంభంలో హంద్రీ–నీవా కాలువలో నీరు రావడం, చెరువుల్లోకి నీరు చేరడంతో రైతులు ఉత్సాహంగా వరి సాగుకు సిద్ధమయ్యారు. పొలాలను దుక్కిదున్ని నారు నాటేందుకు సన్నద్ధం చేసుకున్నారు.

తర్వాత వర్షాలు కురిసి చెరువుల్లోకి నీరు వస్తే పంటకు ఇబ్బంది ఉండదని వారు భావించారు. అయితే పరిస్థితి పూర్తిగా తారుమారైంది. వర్షాలు కురవలేదు. కాలువ నుంచి నీరు రావడం లేదు. బోర్లలోనూ నీటి మట్టం మరింత తగ్గిపోయింది. మరోవైపు వ్యవసాయానికి అందించే విద్యుత్‌ సరఫరాలో కోతలు పెరగడంతో రైతుల ఆందోళన మరింత తీవ్రమైంది.

ప్రస్తుత పరిస్థితుల్లో వరి సాగు చేయాలా వద్దా అన్న సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ఒకవైపు పెట్టుబడుల భారం, మరోవైపు నీటి అనిశ్చితి కారణంగా వారు నిర్ణయం తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారు.

కుప్పం నియోజకవర్గానికి చెందిన రైతులు హంద్రీ–నీవా కాలువ నీటిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ నీటితో పంటలు పండించుకుని ఆర్థికంగా కోలుకుంటామని భావించారు. కానీ కుప్పానికి చేరిన కృష్ణా జలాలు మూడు నెలలకే ఎండిపోయాయి. రెండోసారి కాలువకు నీటిని విడుదల చేయకపోవడంతో అసలు మళ్లీ నీరు వస్తుందో లేదో అన్న అనుమానాలు రైతుల్లో వ్యక్తమవుతున్నాయి.