చిత్తూరు జిల్లా ఎస్.ఆర్ పురం మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో మద్యం వ్యాన్ బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న మద్యం సీసాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోగా, అక్కడికి చేరుకున్న స్థానికులు బాటిళ్ల కోసం ఎగబడిన ఘటన చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. చిత్తూరు నుంచి కార్వేటినగరం మండలానికి మద్యం లోడ్‌తో వెళ్తున్న వ్యాన్ బసిరెడ్డిపల్లి వద్దకు రాగానే టైర్ ఒక్కసారిగా పగిలిపోయింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వ్యాన్ రోడ్డుపక్కకు బోల్తా పడింది. ప్రమాదం సమయంలో వ్యాన్‌లో ఉన్న మద్యం బాక్సులు తెరుచుకుని సీసాలు రోడ్డుపై పడిపోయాయి. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న స్థానికులు రోడ్డుపై పడిన మద్యం సీసాలను ఎత్తుకెళ్లేందుకు పోటీ పడ్డారు. కొందరు పూర్తిగా ఉన్న బాక్సులను మోసుకెళ్లగా, మరికొందరు లుంగీలు, టవళ్లలో సీసాలను కట్టిపట్టి తీసుకెళ్లినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సుమారు రూ.10 లక్షల విలువ చేసే మద్యం బాటిళ్లు ఈ గందరగోళంలో మాయమైనట్లు ప్రాథమిక అంచనాలు వెలువడుతున్నాయి. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్.ఆర్ పురం పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకున్నారు. రహదారిపై పడిన గాజు ముక్కలు, మద్యం సీసాలను తొలగించి ట్రాఫిక్‌ను సజావుగా సాగేందుకు చర్యలు చేపట్టారు. వ్యాన్‌ను క్రేన్ సాయంతో రోడ్డుపక్కకు తరలించారు.