ఐదేళ్లలో ఇబ్బందులు.. ఇప్పుడు 40 శాతం వృద్ధి: మైనింగ్‌ ఆదాయం రూ.3 వేల కోట్లు

అసాధారణ జరిమానాలు, పరిపాలనా లోపాల కారణంగా గత ఐదేళ్లుగా రాష్ట్రంలో మైనింగ్‌ రంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నదని, కూటమి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన తరువాత ఈ రంగంలో గణనీయమైన పునరుజ్జీవనం కనిపిస్తోందని రాష్ట్ర గనులు, భూగర్భ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మైనింగ్‌ రంగంలో 40 శాతం వృద్ధి నమోదై, రాష్ట్రానికి లభిస్తున్న మైనింగ్‌ ఆదాయం ప్రస్తుతం రూ.3 వేల కోట్లకు చేరిందని ఆయన పేర్కొన్నారు.

చిత్తూరు జిల్లాలో మైనింగ్‌ రంగం, ముఖ్యంగా గ్రానైట్‌ క్వారీల సమస్యలపై బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. గనుల శాఖ అధికారులు, గ్రానైట్‌ క్వారీల యజమానులతో ఆయన పరిస్థితులను సమీక్షించారు. జిల్లాలో మైనింగ్‌ లీజుల స్థితిగతులు, కార్యకలాపాల స్థాయిపై అధికారులు వివరాలు సమర్పించారు.

చిత్తూరు జిల్లాలో మొత్తం 682 మైనింగ్‌ లీజులు ఉన్నప్పటికీ, ప్రస్తుతం వాటిలో సుమారు 50 శాతం లీజులలోనే కార్యకలాపాలు సాగుతున్నాయని మంత్రి వివరించారు. వడ్డెర్ల కోసం గుర్తించిన క్వారీలను లీజుకు ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఖనిజ ఆధారిత పరిశ్రమలు వివిధ కారణాలతో నిలిచిపోయిన నేపథ్యంలో, వాటి సమస్యలను సమగ్రంగా అధ్యయనం చేయడానికి ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.

కలర్‌ గ్రానైట్‌ రాయల్టీ విధానం కారణంగా పరిశ్రమలు నష్టపోతున్నాయని, ఈ నేపథ్యంలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో అమలులో ఉన్న విధానాలను పరిశీలించి, అక్కడి అనుభవాల ఆధారంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి నివేదిక సమర్పించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో జేసీ ఆదర్శ్‌ రాజేంద్రన్‌, చుడా ఛైర్‌పర్సన్‌ హేమలత తదితరులు పాల్గొన్నారు.

సమీక్షా సమావేశానికి ముందు మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్‌తో కలిసి కాణిపాకంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామిని దర్శించుకున్నారు. అనంతరం గుడిపాల మండలం కుప్పిగానిపల్లె వద్ద గల క్వారీని పరిశీలించారు. అక్కడ క్వారీ, కటింగ్‌ పరిశ్రమల యాజమాన్యంతో సమావేశమై, వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు.