రాయలసీమ న్యూస్, చిత్తూరు: శేషాచలం రిజర్వు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్‌లో 44కు పైగా ఎర్రచందనం కేసుల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న అంతర్రాష్ట్ర స్మగ్లర్‌తో పాటు మరో స్మగ్లర్‌ను అదుపులోకి తీసుకున్నారు.
ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక దళం RSASTF హెడ్ ఎల్. సుబ్బారాయుడు మార్గదర్శకత్వంలో, టాస్క్‌ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్, అదనపు ఎస్పీ జె. కులశేఖర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి శేషాచలం అడవుల్లో అక్రమ రవాణాపై నిఘా కొనసాగిస్తున్నాయి.
స్టేట్ ఇంటెలిజెన్స్, అటవీశాఖ సిబ్బందికి అందిన కచ్చితమైన సమాచారంతో చిత్తూరు జిల్లా గుడిపాల మండలం చిత్తపార ఫారెస్ట్ బీట్ పరిధిలో, పనాటూరు సమీపంలోని చిత్తూరు–వేలూరు రహదారిపై అండర్‌బ్రిడ్జి వద్ద వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల సమయంలో హ్యుందాయ్ వెన్యూ కారులో ఎర్రచందనం తరలిస్తున్న ఇద్దరిని టాస్క్‌ఫోర్స్ బృందం పట్టుకుంది.
అరెస్టైన వారిలో తమిళనాడు రాష్ట్రం వెల్లూరు జిల్లా కిలరసంపట్టు ప్రాంతానికి చెందిన ఎం. తంజి (35) ఉన్నాడు. పోలీసుల విచారణలో తంజిపై చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో 44కు పైగా ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు నమోదై ఉన్నట్లు గుర్తించారు. ఆయా కేసుల్లో ఇప్పటి వరకు అరెస్టు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నట్లు విచారణలో బయటపడింది.
అతనితో పాటు తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా జమునామత్తూరు తాలూకాకు చెందిన సెల్వం (45) ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి 7 ఎర్రచందనం దుంగలు, హ్యుందాయ్ వెన్యూ కారు, అపాచీ మోటార్‌సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.
నిందితులు ఒక ముఠాగా ఏర్పడి తమిళ కూలీలను ఉపయోగించి శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం చెట్లను నరికిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చెట్లను దుంగలుగా తయారు చేసి అడవుల్లో డంప్ చేయడంతో పాటు, అవకాశం లభించినప్పుడు వాహనాల్లో తరలించి బెంగళూరు, చెన్నై తదితర ప్రాంతాల్లోని ప్రధాన స్మగ్లర్లకు విక్రయిస్తున్నట్లు విచారణలో వెల్లడైనట్లు పేర్కొన్నారు.
ఈ ముఠా వెనుక ఉన్న బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు చెందిన ప్రధాన స్మగ్లర్లను గుర్తించి అరెస్ట్ చేసేందుకు దర్యాప్తు కొనసాగుతోంది. స్మగ్లింగ్‌కు సహకరిస్తున్న ఇతర వ్యక్తులు, ప్రధాన సూత్రధారులను గుర్తించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.
అంతర్రాష్ట్ర స్మగ్లర్‌ను అరెస్ట్ చేయడంతో పాటు ఎర్రచందనం దుంగలు, వాహనాలను స్వాధీనం చేసుకున్న టాస్క్‌ఫోర్స్ బృందాన్ని RSASTF హెడ్ ఎల్. సుబ్బారాయుడు అభినందించారు. విధుల్లో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి రివార్డులు ప్రకటించారు. శేషాచలం అటవీ ప్రాంతంలో ఎర్రచందనం అక్రమ నరికివేత, రవాణాకు పాల్పడే వారిపై భవిష్యత్తులోనూ కఠిన చర్యలు కొనసాగుతాయని టాస్క్‌ఫోర్స్ అధికారులు స్పష్టం చేశారు.













