పుంగనూరు: పుంగనూరు నియోజకవర్గ తెలుగు దేశం పార్టీలో కీలక మార్పు చోటుచేసుకుంది. ఈ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్‌గా మధుసూదన్ నాయుడును టీడీపీ అధిష్ఠానం నియమించింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ శనివారం అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.

ఇప్పటివరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్‌గా కొనసాగుతున్న చల్లా రామచంద్రారెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పిస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. కొత్తగా మధుసూదన్ నాయుడుకు బాధ్యతలు అప్పగించడంతో పుంగనూరు టీడీపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది.

మధుసూదన్ నాయుడు నియామకంపై ఆయన అభిమానులు, అనుచరులు నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో సంబరాలు నిర్వహించారు. మిఠాయిలు పంచుకుంటూ, నినాదాలు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

పార్టీ అధిష్ఠానం తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే రోజుల్లో పుంగనూరు రాజకీయాలపై ఎలాంటి ప్రభావం చూపుతుందనే దానిపై స్థానికంగా చర్చ మొదలైంది. నియోజకవర్గంలో టీడీపీ అంతర్గత సమీకరణలు, భవిష్యత్ రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఈ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది.