రాయలసీమ న్యూస్, చిత్తూరు: చిత్తూరు, గంగాధరనెల్లూరు:-జిల్లాలో తోతాపురి మామిడి రైతులు మరోసారి ధరల పతనంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతేడాది మాదిరిగానే ఈ సీజన్లో కూడా మామిడి ధరలు కుంగిపోయాయి. సీజన్ ప్రారంభంలో తోతాపురి కిలోకు రూ.10–రూ.12 చెల్లించిన గుజ్జు పరిశ్రమలు, సరఫరా పెరిగిన కొద్దీ ధరను తగ్గిస్తూ రూ.3–రూ.5కు పరిమితం చేశాయి. ఈ ఏడాది అయితే మొదటి నుంచే కిలోకు రూ.3–రూ.6కే మించి ఇవ్వలేమని పరిశ్రమల యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి.
గుజ్జు పరిశ్రమలు సిండికేటుగా మారి తమకిష్టమైన రేట్లను అమలు చేస్తుండటంతో రైతులు నష్టాల్లో కూరుకుపోతున్నారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ సిండికేటు గుత్తాధిపత్యాన్ని అదుపులోకి తెచ్చే చర్యలు తీసుకుంటేనే అన్నదాతల సమస్యలు కొంతవరకు తీరుతాయని రైతులు భావిస్తున్నారు. లేదంటే గతేడాది లాగే ఈ ఏడాదీ కూడా కిలోకు కనీసం రూ.4–రూ.5 అదనంగా ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుందని వారు చెబుతున్నారు.
గత పది రోజులుగా తోతాపురి మామిడి కోతలు పెరగడంతో కర్మాగారాల వద్ద ట్రాక్టర్లు, లారీల క్యూలు పెరిగిపోయాయి. జిల్లావ్యాప్తంగా సుమారు 15 గుజ్జు పరిశ్రమలు మాత్రమే పనిచేస్తుండటంతో, వాటి సామర్థ్యానికి మించి సరఫరా జరుగుతోంది. దీంతో యాజమాన్యాలు రైతులను వేచి చూడమని కోరుతున్నాయి. రెండు–మూడు రోజులకుపైగా వాహనాల్లో నిల్వ ఉండే సరుకులో దాదాపు 20–30 శాతం వరకు పాడైపోతుండటంతో రైతులు మరింత నష్టపోతున్నారు.
రెండు జిల్లాల్లోని గుజ్జు పరిశ్రమలను పూర్తిస్థాయిలో నడిపించి, గరిష్ఠ సామర్థ్యంతో మామిడి కొనుగోలు చేస్తే రైతుల పడిగాపులు తగ్గుతాయని వ్యవసాయ వర్గాలు సూచిస్తున్నాయి. ప్రస్తుతం తమిళనాడులోని క్రిష్ణగిరిలో తోతాపురి కిలోకు రూ.2–రూ.4 మాత్రమే పలుకుతోంది. మన రాష్ట్రంలోని గుజ్జు పరిశ్రమలు కూడా అక్కడి రైతుల నుంచి తక్కువ ధరలకు మామిడి కొనుగోలు చేస్తున్నాయి. కర్ణాటకలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వాలతో చర్చలు జరిపి, మూడు రాష్ట్రాల్లోనూ తోతాపురి మామిడికి కనీస ధర నిర్ణయించి, ఆ మేరకే కొనుగోలు జరిగేలా చూడాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. గతేడాదిలాగే ఈ ఏడాదీ కూడా ఆ రాష్ట్రాల నుంచి మన జిల్లాకు మామిడి రాకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
తోతాపురి మామిడి రైతుల సమస్యలపై వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఆరు రోజుల క్రితం విజయవాడలో పరిశ్రమల ప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో పరిశ్రమల యాజమాన్యాలు తమ సమస్యలను వివరించాయి. గతేడాది కొనుగోలు చేసిన గుజ్జు పూర్తిగా అమ్ముడుపోలేదని, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ తగ్గిందని, ఈ నేపథ్యంలో తమ ఆర్థిక స్థితి బలహీనపడడంతో బ్యాంకులు కూడా కొత్త రుణాల విషయంలో వెనుకంజ వేస్తున్నాయని వారు తెలిపారు.
ఈ సమస్యల పరిష్కారానికి గుజ్జు వినియోగాన్ని పెంచడం ఒక్కటే మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. దేవాలయాల్లో అన్నదానంలో మామిడి రసం పంపిణీ చేయడం, ఇంకా నిల్వలు ఉంటే పాఠశాలల మధ్యాహ్న భోజన పథకంలోనూ మామిడి ఉత్పత్తులను వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయంగా డిమాండ్ తగ్గిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్న ఈ మార్గాన్ని సమర్థంగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని వ్యవసాయ వర్గాలు చెబుతున్నాయి.
దామలచెరువు మండలానికి చెందిన రైతు పత్తిపాటి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ఈ సీజన్లో 20 టన్నుల మామిడి కాయలు కోతకు సిద్ధంగా ఉన్నప్పటికీ, మొదట్లో టన్నుకు రూ.5 వేల వరకు వస్తుందని భావించామని, ఇప్పుడు టన్నుకు రూ.3 వేలకే కొనుగోలు చేస్తున్నారని, ఈ ధరలతో కోత కూలీలు, రవాణా ఖర్చులు కూడా రాకుండా పరిస్థితి దారుణంగా మారిందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుజ్జు పరిశ్రమల సిండికేటు గుత్తాధిపత్యం వల్లే ఈ దుస్థితి నెలకొందని వారు ఆరోపిస్తున్నారు.













