రాయలసీమ న్యూస్, క్రైమ్ డెస్క్:
టిండర్ యాప్‌లో హనీట్రాప్.. రూ.52 లక్షలు కోల్పోయిన మహిళా న్యాయమూర్తి
హరియాణాలో ఓ మహిళా న్యాయమూర్తి హనీట్రాప్ బారిన పడి భారీ మొత్తాన్ని కోల్పోయిన ఘటన వెలుగులోకి వచ్చింది. టిండర్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తి నమ్మకాన్ని సొంతం చేసుకుని పెట్టుబడుల పేరుతో ఆమె నుంచి రూ.52 లక్షలకు పైగా వసూలు చేసినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో నిందితుడిని అరెస్టు చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించినప్పటికీ, దర్యాప్తు లోపాలపై కోర్టు ఆక్షేపించింది.
వివరాల ప్రకారం, హరియాణాకు చెందిన మహిళా న్యాయమూర్తికి గతేడాది నవంబరులో టిండర్ యాప్ ద్వారా అభిమన్యు వశిష్ఠ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొద్దికాలంలోనే వీరి మధ్య సన్నిహిత సంబంధం ఏర్పడింది. అనంతరం పెట్టుబడి పెడితే అధిక లాభాలు వస్తాయని చెప్పి అభిమన్యు ఆమెను నమ్మబలికాడు. తన సూచనల మేరకు పెట్టుబడులు పెడితే మంచి రాబడులు వస్తాయని చెప్పి పెద్ద మొత్తంలో డబ్బు పంపించుకునేలా చేశాడు.
ఈ క్రమంలో మహిళా న్యాయమూర్తి అభిమన్యు వశిష్ఠ్ సూచించిన ఖాతాలకు విడతలవారీగా రూ.52 లక్షలకు పైగా బదిలీ చేసినట్టు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. అయితే, ఎంతోకాలం గడిచినా ఎలాంటి లాభాలు రాకపోవడంతో ఆమెకు అనుమానం కలిగి, తాను మోసపోయానని గ్రహించినట్టు తెలిసింది.
ఈ ఘటనపై మహిళా న్యాయమూర్తి స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయకుండా, తన ఇంట్లో పనిచేసే సహాయకురాలి పేరుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. సహాయకురాలి బ్యాంకు ఖాతా నుంచి నిధుల బదిలీ జరిగినట్టు మొదట కేసు నమోదు అయినప్పటికీ, అనంతర దర్యాప్తులో వాస్తవాలు బయటపడ్డాయి.
ఈ కేసు బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా అదనపు సెషన్స్ జడ్జి సౌరభ్ ప్రతాప్ సింగ్ కీలక పరిశీలనలు చేశారు. లావాదేవీలు సహాయకురాలి ఖాతా నుంచి కాకుండా నేరుగా మహిళా న్యాయమూర్తి వ్యక్తిగత ఖాతాల నుంచి జరిగాయని ఆయన గమనించారు. అంతేకాకుండా దర్యాప్తు అధికారులు నిందితుడు, న్యాయమూర్తి మధ్య జరిగిన పూర్తి WhatsApp చాట్‌లు, కాల్ రికార్డులను సేకరించలేదని కోర్టు పేర్కొంది.
దర్యాప్తు అసంపూర్తిగా ఉందని, ఇంకా కీలక సాక్ష్యాలు సేకరించాల్సి ఉందని గుర్తించిన అదనపు సెషన్స్ కోర్టు, ఈ దశలో నిందితుడు అభిమన్యు వశిష్ఠ్‌కు బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. టిండర్ యాప్, WhatsAppలలో ఇరువురి మధ్య జరిగిన పూర్తి సంభాషణలను తప్పనిసరిగా సేకరించాలని దర్యాప్తు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
అలాగే నిధుల బదిలీలకు సంబంధించిన పూర్తి వివరాలు, నిందితుడి ఫోన్‌కు సంబంధించిన ఫోరెన్సిక్ విశ్లేషణను త్వరితగతిన నిర్వహించాలని కోర్టు సూచించింది. ఈ కేసు నేపథ్యంతో ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లు, సోషల్ మీడియా వేదికల ద్వారా జరుగుతున్న హనీట్రాప్ మోసాలపై మరోసారి దృష్టి కేంద్రీకృతమైంది.







