రాయలసీమ న్యూస్, కర్ణాటక డెస్క్:
జిమ్ ట్రైనర్ విజయ్ హత్యకు రూ.50 లక్షల సుపారీ
కర్ణాటకలో జిమ్ ట్రైనర్ విజయ్ యాదవ్ హత్య కేసు సంచలనం రేపుతోంది. ఈ హత్య వెనుక ఒక పలుకుబడి ఉన్న వ్యాపారవేత్త ప్రమేయం ఉందని మృతుని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా ముళబాగిలుకు చెందిన జిమ్ ట్రైనర్ విజయ్ యాదవ్ (35) జూన్ 10న బన్నేరుఘట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రాగిహళ్లి సమీపంలో మృతదేహంగా గుర్తించారు. అప్పటికే శవం కుళ్లిపోయిన స్థితిలో ఉండటంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సాంకేతిక ఆధారాలు, కాల్ డేటా రికార్డులు తదితరాలను పరిశీలించిన పోలీసులు శ్రీరామ్, సుమిత్, వెంకటేశయ్య, బాబు అనే నలుగురిని నిందితులుగా గుర్తించి అరెస్ట్ చేశారు. వీరంతా రౌడీషీటర్లుగా గుర్తించినట్లు కుటుంబ సభ్యులు పేర్కొంటున్నారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు హత్యకు దారితీసిన కారణాలు, వెనుక ఉన్న మాస్టర్‌మైండ్ ఎవరు అనే కోణంలో విచారణ కొనసాగిస్తున్నారు.
విజయ్ బంధువు, న్యాయవాది వాసుదేవరెడ్డి ఈ కేసు నేపథ్యంపై వివరాలు వెల్లడించారు. విజయ్ సుమారు ఏడాది క్రితం బెంగళూరుకు వెళ్లి అక్కడే జిమ్ ట్రైనర్‌గా పనిచేస్తున్నాడని, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యతో ఇద్దరు పిల్లలు ఉన్నారని తెలిపారు. బెంగళూరులోని జిమ్‌లో ఒక యువతితో విజయ్‌కు పరిచయం ఏర్పడిందని, ఆ యువతి తండ్రి ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరుకు చెందిన ప్రముఖ రియల్టర్–వ్యాపారవేత్త అని చెప్పారు.
వాసుదేవరెడ్డి ప్రకారం, ఆ యువతి తండ్రి తన కూతురితో మాట్లాడవద్దని విజయ్‌ను తీవ్రంగా హెచ్చరించాడని, దీంతో విజయ్ స్వగ్రామమైన ముళబాగిలుకు వెళ్లిపోయాడని తెలిపారు. అయితే ఆ యువతి విజయ్‌ను వెతుకుతూ ముళబాగిలుకే వెళ్లిందని, అంతకుముందు ఇద్దరూ 21 రోజుల పాటు ఉత్తర భారతదేశంలో టూర్‌కు వెళ్లిన విషయాన్ని గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో ఆ యువతి అదృశ్యమైందని ఆరోపణలతో బెంగళూరు కే.ఆర్.పురం పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదైనట్లు చెప్పారు.
ఈ పరిణామాలన్నింటిని గమనించిన విజయ్ భార్య విడాకులు, భరణం కోసం కోర్టులో కేసు దాఖలు చేసిందని, అది విచారణలో ఉందని వాసుదేవరెడ్డి తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న విజయ్ తిరిగి బెంగళూరు కే.ఆర్.పురానికి వెళ్లి మరో జిమ్‌లో ట్రైనర్‌గా చేరాడని చెప్పారు.
‘ఈ హత్యకు పాల్పడిన వారు రౌడీషీటర్లు. వారికి ఆ యువతి తండ్రి రూ.25 లక్షల నుంచి 50 లక్షల వరకు సుపారీ ఇచ్చి హత్య చేయించాడు. కొంతమంది న్యాయవాదులు ఈ సుపారీని కుదిర్చారు. ఈ హత్య వెనుక ఆ న్యాయవాదులే ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. ఆ న్యాయవాదులను కూడా అరెస్ట్ చేయాలి’ అని వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు.
ఈ కేసుపై డీఐజీ ఎస్. గిరీష్ కూడా స్పందించారు.
‘ఈ హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేశాం. వారిని అదుపులోకి తీసుకుని తదుపరి విచారణ జరుపుతాం’ అని తెలిపారు.
విజయ్ హత్య కేసులో వ్యాపారవేత్త, న్యాయవాదుల ప్రమేయంపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో దర్యాప్తుపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. పోలీసులు ఇప్పటికే సేకరించిన సాంకేతిక ఆధారాలు, నిందితుల విచారణలో లభిస్తున్న వివరాల ఆధారంగా తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది.







