డిజిటల్‌ మోసాలు భారత్‌లోనే అధికం: ట్రాన్స్‌యూనియన్‌ నివేదిక

దేశంలో ఆర్థిక సేవలు సహా పలు రంగాల్లో డిజిటలీకరణ వేగంగా విస్తరిస్తుండగా, అదే స్థాయిలో డిజిటల్‌ మోసాల ముప్పు కూడా పెరుగుతోందని క్రెడిట్‌ బ్యూరో సంస్థ ట్రాన్స్‌యూనియన్‌ వెల్లడించింది. తాజాగా విడుదల చేసిన ‘టాప్‌ ఫ్రాడ్‌ ట్రెండ్స్‌’ నివేదికలో భారత్‌లో డిజిటల్‌ లావాదేవీలపై మోసాల తీవ్రత ప్రపంచ సగటుతో పోలిస్తే గణనీయంగా అధికంగా ఉన్నట్లు పేర్కొంది.

నివేదిక ప్రకారం 2025లో భారత వినియోగదారులు నిర్వహించిన మొత్తం డిజిటల్‌ లావాదేవీల్లో 7.1 శాతం మోసపూరితమైనవిగా తేలాయి. అంతర్జాతీయంగా ఈ రేటు 3.8 శాతం మాత్రమే. అంటే ప్రపంచ సగటు కంటే భారత్‌లో డిజిటల్‌ మోసాల రేటు దాదాపు రెట్టింపు కంటే ఎక్కువగా నమోదైందని ట్రాన్స్‌యూనియన్‌ స్పష్టం చేసింది. లాజిస్టిక్స్‌, టెలికాం, బీమా రంగాల్లో ఈ ముప్పు మరింత ఎక్కువగా ఉన్నట్లు నివేదికలో పేర్కొంది.

గుర్తింపు ధ్రువీకరణ, అథెంటికేషన్‌ వ్యవస్థల్లో ఉన్న లోపాలను మోసగాళ్లు ప్రధానంగా వినియోగించుకుంటున్నారని ట్రాన్స్‌యూనియన్‌ విశ్లేషించింది. రియల్‌ టైమ్‌ ఇంటరాక్షన్లు, నిరంతరం లావాదేవీలు జరిగే రంగాలు వీరి ప్రధాన లక్ష్యాలుగా మారుతున్నాయని తెలిపింది.

విలువ పరంగా చూస్తే, భారత్‌లో జరుగుతున్న మొత్తం డిజిటల్‌ లావాదేవీల్లో మోసపోయే మొత్తం, అంతర్జాతీయ సగటు కంటే 36 శాతం ఎక్కువగా నమోదైందని నివేదికలో పేర్కొంది. సంఖ్యాపరంగా కూడా ప్రపంచ సగటుతో పోలిస్తే దాదాపు రెట్టింపు స్థాయిలో మోసాలు చోటుచేసుకుంటున్నాయని ట్రాన్స్‌యూనియన్‌ తెలిపింది.

గత ఏడాది సైబర్‌ మోసాల కారణంగా భారత వినియోగదారులు సగటున 2,265 డాలర్లు, అంటే దాదాపు రూ.2.04 లక్షలు నష్టపోయినట్లు నివేదికలో వెల్లడించారు. అంతర్జాతీయ సగటు నష్టం 1,671 డాలర్లుగా ఉంది. 2025 ఆగస్టు నుంచి డిసెంబరు మధ్య తమను మోసగించే ప్రయత్నాలు జరిగాయని 59 శాతం మంది వినియోగదారులు తెలిపారని, వాస్తవంగా మోసాలకు గురయ్యామని 13 శాతం మంది పేర్కొన్నారని ట్రాన్స్‌యూనియన్‌ వివరించింది. ఇది అంతర్జాతీయ సగటు 10 శాతంతో పోలిస్తే ఎక్కువే.

ప్రపంచవ్యాప్త ధోరణులతో పోలిస్తే భారత్‌లో సైబర్‌ నేరగాళ్ల వ్యూహం కొంత భిన్నంగా ఉందని నివేదిక చెబుతోంది. సాధారణంగా కొత్త అకౌంట్‌ సృష్టించే సమయంలో మోసాలు ఎక్కువగా నమోదవుతుంటే, భారత్‌లో మాత్రం అకౌంట్‌ లాగిన్‌ దశలోనే అత్యధికంగా 3.9 శాతం మోసపూరిత ప్రయత్నాలు జరుగుతున్నాయని ట్రాన్స్‌యూనియన్‌ గుర్తించింది. వినియోగదారుల నుంచి దొంగిలించిన లేదా లీక్‌ అయిన ఐడీలు, పాస్‌వర్డ్‌లను ఉపయోగించి ఇప్పటికే యాక్టివ్‌గా ఉన్న ఖాతాలను తమ ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయని తెలిపింది.

కొత్త ఖాతాల సృష్టి సమయంలో మోసాల రేటు 3.1 శాతం, ఆర్థిక లావాదేవీల సమయంలో 1.2 శాతంగా ఉందని నివేదికలో పేర్కొన్నారు.

సైబర్‌ ముప్పు ఇంతగా పెరుగుతున్న నేపథ్యంలో డిజిటల్‌ వ్యాపారాలు, బ్యాంకులు, సేవలందించే సంస్థలు తమ ఆన్‌బోర్డింగ్‌, లాగిన్‌ వ్యవస్థల్లో ఐడెంటిటీ వెరిఫికేషన్‌, టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ వంటి భద్రతా ప్రమాణాలను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ట్రాన్స్‌యూనియన్‌ సూచించింది.