చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో కొత్త మలుపు..

పెంపుడు కుక్క మృతి

తుని: రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి అదృశ్యం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో కీలక ఆధారంగా భావించిన పెంపుడు కుక్క మృతి చెందింది. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు చేపట్టిన గాలింపు చర్యల్లో భాగంగా ఆ శునకానికి ముందుగా జీపీఎస్‌ ట్రాకర్‌ అమర్చారు.

జీపీఎస్‌ ట్రాకర్‌ అమర్చిన అనంతరం ఆ కుక్క సుమారు 80 నిమిషాల పాటు పలు ప్రాంతాల్లో తిరిగింది. దాదాపు 8 కిలోమీటర్ల మేర సంచరించిన తర్వాత తిరిగి ఇంటికి చేరుకుంది. ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందింది. నిన్నటి నుంచి ఆహారం తీసుకోకపోవడమే కుక్క మృతికి కారణమై ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

పెంపుడు కుక్క మృతితో దర్యాప్తు దిశలో పోలీసులు కీలక ఆధారాన్ని కోల్పోయినట్టయ్యింది. జ్ఞానేశ్వరి అదృశ్యమైన రోజు నుంచి ఈ శునకం ప్రవర్తన, తిరిగిన మార్గాలు కేసు విచారణలో ముఖ్యంగా పరిగణనలోకి తీసుకుంటున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది.

మరోవైపు, చిన్నారి జ్ఞానేశ్వరి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. స్థానికుల నుంచి సమాచారం సేకరణ, పరిసర ప్రాంతాల్లో శోధన, సీసీ కెమెరా దృశ్యాల పరిశీలన వంటి చర్యలు కొనసాగుతున్నాయని వెల్లడిస్తున్నారు.

కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్‌ అగ్రహారానికి చెందిన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి గత శనివారం అదృశ్యమైంది. బాలికతో పాటు ఇంటి పెంపుడు కుక్క కూడా కనిపించకుండా పోయింది. అనంతరం ఆ శునకం తోటలోని మకాం వద్దకు తిరిగి వచ్చింది. అప్పటికే అక్కడ పెద్ద సంఖ్యలో పోలీసులు, బాలిక కుటుంబ సభ్యులు ఉండటాన్ని గమనించిన కుక్క మళ్లీ అక్కడి నుంచి వెళ్లిపోయింది.

ఐదు రోజుల తర్వాత ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కొంతమంది యువకులు ఆ కుక్కను చాకచక్యంగా పట్టుకున్నారు. దానికి జీపీఎస్‌ ట్రాకర్‌ అమర్చి, అది తిరిగే మార్గాన్ని అనుసరించడం ద్వారా ఎక్కడైనా చిన్నారి ఆచూకీ లభించవచ్చని పోలీసులు భావించారు. అయితే కుక్క మృతి చెందడంతో ఆ ఆశలు దెబ్బతిన్నాయి.

చిన్నారి కోసం పోలీసులు, స్థానికులు, కుటుంబ సభ్యులు కలిసి గాలింపు చర్యలను కొనసాగిస్తున్నారు. ఈ కేసు పరిష్కారానికి సహాయపడే సమాచారం ఉన్నవారు ముందుకు రావాలని, దర్యాప్తుకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు.