రాయలసీమ న్యూస్, క్రైమ్ డెస్క్: విదేశీ మారకపు ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) కింద రూ.2,424.44 కోట్ల విలువైన ఉల్లంఘనలకు పాల్పడిన అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్‌కు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జరిమానాతో కూడిన మినహాయింపు ఇచ్చింది. ఫెమా చట్టంలోని వివిధ నిబంధనల కింద ఆ సంస్థ చేసిన ఉల్లంఘనలన్నింటినీ కాంపౌండింగ్ ప్రక్రియ ద్వారా మాఫీ చేస్తూ, వన్‌టైం పేమెంట్ రూపంలో రూ.17.76 కోట్ల జరిమానా విధించింది.
అలాగే ఆ సంస్థ డైరెక్టర్లు, ఆఫీసర్లైన ప్రీతారెడ్డి, సునీతారెడ్డి, ఎస్‌కె వెంకటరామన్, అఖిలేశ్వరన్ కృష్ణన్, ఎస్‌ఎం కృష్ణన్‌లకు వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి రూ.18 లక్షల చొప్పున జరిమానా విధించినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారం వెల్లడించింది.
అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్, ఆ సంస్థ డైరెక్టర్లు, ఆఫీసర్లపై ఫెమా నిబంధనల ఉల్లంఘనల కేసులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫారిన్ ఎక్స్సేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్-1999లోని సెక్షన్ 15 కింద మాఫీ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈడీ తెలిపింది. ఈ ఉత్తర్వుల జారీతో ఆ చట్టం కింద వారిపై కొనసాగుతున్న న్యాయవిచారణ ప్రక్రియ రద్దు కానున్నట్లు స్పష్టం చేసింది.
విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఫెమా చట్టంలోని నిబంధనల కింద ఈ కేసులో తాము దర్యాప్తు చేపట్టినట్లు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ వెల్లడించింది. అనంతరం ఫెమా చట్టంలోని సెక్షన్ 16 ప్రకారం అడ్జుడికేటింగ్ అథారిటీ ముందు ఫిర్యాదు దాఖలు చేసినట్లు తెలిపింది.
ఫెమా చట్టంలోని సెక్షన్ 15 కింద జరిగిన ఉల్లంఘనల నుంచి మినహాయింపు కోరుతూ అపోలో హాస్పిటల్స్ ఎంటర్‌ప్రైజెస్ లిమిటెడ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు దరఖాస్తు చేసుకున్నట్లు ఈడీ వివరించింది. ఆ దరఖాస్తు విషయాన్ని ఆర్‌బీఐ తమకు ప్రతిపాదించగా, చట్ట స్ఫూర్తికి లోబడి ఆ ఉల్లంఘనలకు మాఫీ ఇవ్వడంపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌కు అభ్యంతరం లేదని తెలియజేసినట్లు పేర్కొంది.
ఈ నిరభ్యంతర పత్రాన్ని పరిగణనలోకి తీసుకుని, కింద పేర్కొన్న ఉల్లంఘనలను వన్‌టైం పేమెంట్ కింద కాంపౌండ్ చేస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాఫీ ఉత్తర్వులు జారీ చేసినట్లు ఈడీ స్పష్టం చేసింది. ఈ మేరకు సంస్థపై, సంబంధిత డైరెక్టర్లు, ఆఫీసర్లపై విధించిన జరిమానా చెల్లింపుతో ఫెమా కింద కొనసాగుతున్న న్యాయ ప్రక్రియ ముగిసే అవకాశం ఉంది.







