రాయలసీమ న్యూస్, క్రైమ్ డెస్క్:
సాయికృష్ణ కేసులో
హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుల్‌దే కీలక పాత్ర
‘సాయికృష్ణ మృతి విషయంలో వాస్తవాలు బయటకు రాకుండా కానిస్టేబుల్ బాబూరావు, హెడ్ కానిస్టేబుల్ సాంబయ్యలు.. కృష్ణలంక స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజి తొలగింపులో కీలకపాత్ర పోషించారు. ఫుటేజి స్టోర్ అయిన నాలుగు హార్డ్‌డిస్కులను మార్చేశారు. అసలువాటి స్థానంలో వేరేవి తీసుకొచ్చి పెట్టారు’ అని సిట్ రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. ఈ కేసులో నిందితులుగా చేర్చిన బాబూరావు, సాంబయ్యలను బుధవారం అరెస్టుచేశారు. వైద్యపరీక్షల అనంతరం వీరిని కోర్టులో న్యాయాధికారి శ్రీకాంత్ ఎదుట బుధవారం హాజరుపర్చారు. వీరి రిమాండ్ రిపోర్టులోని అంశాలివీ..
హార్డ్‌డిస్కులు తమవి కావన్న సౌత్రిక టెక్నాలజీస్
కృష్ణలంక స్టేషన్ లోపల, బయట ఉన్న సీసీ కెమెరాల్లో సాయికృష్ణను మార్కాపురం నుంచి తెచ్చిన దృశ్యాలతో పాటు.. అక్కడ జరిగిన వ్యవహారమంతా రికార్డయింది. విచారణ సమయంలో సీసీటీవీ ఎన్‌వీఆర్, నాలుగు హార్డ్‌డిస్కులను ఫోరెన్సిక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిని ఏర్పాటుచేసిన సౌత్రిక టెక్నాలజీస్ నుంచి సిట్ అధికారులు వివరాలు తీసుకున్నారు. సీజ్‌చేసిన హార్డ్‌డిస్కులు తాము ఏర్పాటుచేసినవి కావని వాళ్లు తెలిపారు. ఎన్‌వీఆర్ (నెట్‌వర్క్ వీడియో రికార్డర్) మాత్రమే తాము ఇచ్చినదని చెప్పడంతో అసలు విషయం బయటకు వచ్చింది. తమ ఐటీ కోర్ టీమ్.. కృష్ణలంక స్టేషన్‌లోని హార్డ్‌డిస్కులను మార్చలేదని సీపీ కూడా తెలిపారు. దీంతో వీరిపై అదనంగా మరిన్ని సెక్షన్లు జోడించారు. విచారణలో నిందితులిద్దరూ సాయికృష్ణ మృతిపై నోరువిప్పలేదు. స్టేషన్‌లో గత నెల 19న స్వాధీనం చేసుకున్న హార్డ్‌డిస్క్‌ల్లో ఫుటేజి ఏమీ లేదు. గత 18 నెలల్లో రికార్డయిన దృశ్యాలు లేవు.
సాయికృష్ణ మృతిపై మెజిస్టీరియల్ విచారణ
కస్టోడియల్ మరణంపై ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. బీఎన్‌ఎస్‌లోని 196 సెక్షన్ కింద విజయవాడ ఆర్డీవో వెన్నెల శ్రీనును విచారణ అధికారిగా నియమిస్తూ ఆదేశాలు జారీచేశారు. 30 రోజుల్లోగా నివేదికను సమర్పించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.
నిందితులు చెరొక జైలుకు..
స్టేషన్‌లో మీ బాధ్యతలు ఏంటని నిందితులు బాబూరావు, సాంబయ్యలను న్యాయామూర్తి ప్రశ్నించగా.. తాము స్టేషన్‌లో క్రైమ్ హెడ్‌కానిస్టేబుల్, కానిస్టేబుళ్లమని సమాధానమిచ్చారు. మీరేమైనా చెప్పదలచుకున్నారా? అని అడగ్గా.. ‘మేము క్రైం విభాగం చూస్తుంటాము. ఎక్కువగా రికవరీల నిమిత్తం బయట ప్రాంతాలకు వెళ్తుంటాం. స్టేషన్‌లో ఏం జరిగేది మాకు తెలియదు. ఈ కేసుతో మాకు సంబంధం లేదు’ అని అన్నారు. అనంతరం వీరికి ఈ నెల 15 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు ఉత్తర్వులిచ్చింది. వీరిద్దరినీ నెల్లూరు, విజయవాడ, రాజమహేంద్రవరం కారాగారాలకు పంపొద్దని న్యాయవాదులు కోరడంతో బాబూరావును అవనిగడ్డ, సాంబయ్యను గన్నవరంలోని కారాగారాలకు రిమాండ్ నిమిత్తం పంపించాలని న్యాయామూర్తి ఆదేశాలిచ్చారు.







