రాయలసీమ న్యూస్, క్రైమ్ డెస్క్: ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కుటుంబానికి సాయం చేయడం లేదన్న ఆగ్రహంతో ఓ తండ్రి తన 21 ఏళ్ల కొడుకును క్రికెట్ బ్యాట్‌తో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఇంట్లోనే ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనతో ప్రాంతంలో కలకలం రేగింది.
పోలీసులు, స్థానికుల సమాచారం ప్రకారం.. అర్ధవీడు మండల పరిధిలో నివాసం ఉంటున్న జావేద్ భాషా (21), అతడి తండ్రి సిలార్ (60) మధ్య కొంతకాలంగా కుటుంబ విషయాలపై విభేదాలు కొనసాగుతున్నాయి. చేతికొచ్చిన కొడుకు కుటుంబానికి సాయపడటం లేదన్న కోపంతో సిలార్ మంగళవారం మధ్యాహ్నం ఇంటి ఆవరణలో మంచంపై పడుకుని ఉన్న జావేద్ తలపై క్రికెట్ బ్యాట్‌తో బలంగా దాడి చేశాడు.
ఆ దాడిలో జావేద్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. కొడుకు ప్రాణాలు కోల్పోయి ఉంటాడని ఆందోళనకు గురైన సిలార్ ఇంట్లోకి వెళ్లి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొద్ది సేపటికి పొలం పనుల నుంచి తిరిగి వచ్చిన జావేద్ తల్లి సాబిరా ఇంటి ఆవరణలో మంచంపై రక్తపు మడుగులో పడి ఉన్న కొడుకుని చూసి షాక్‌కు గురైంది. ఆమె కేకలు విన్న స్థానికులు అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనించారు.
తక్షణమే జావేద్‌ను కారులో కంభం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి అప్పటికే అతడు మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ఇదిలా ఉండగా సిలార్ ఇంట్లో కనిపించకపోవడంతో స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఇంటి తలుపు పగలగొట్టి చూడగా.. సిలార్ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు గుర్తించారు.
వార్త అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దారుణం జరిగినట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ సంఘటనతో అర్ధవీడు మండలంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రి, కొడుకు ఇద్దరూ తక్కువ సమయంలో ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది. కుటుంబ సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకోవాల్సిన అవసరాన్ని ఈ ఘటన మరోసారి గుర్తుచేసిందని గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నారు.







