రాయలసీమ న్యూస్, క్రైమ్ డెస్క్: ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం చేబ్రోలు రైల్వే స్టేషన్ సమీపంలో శనివారం రాత్రి ఘోర రైలుప్రమాదం చోటుచేసుకుంది. చర్లపల్లి నుంచి షాలిమార్ వైపు వెళ్తున్న ప్రత్యేక రైలు ఢీకొనడంతో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఒక పురుషుడు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ప్రమాద తీవ్రత కారణంగా మృతదేహాలు ఛిద్రమై, గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న తాడేపల్లిగూడెం గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతులు రైలుమార్గంపైకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని, ఒకే కుటుంబానికి చెందిన వారై ఉండే అవకాశముందని పోలీసులు అనుమానిస్తున్నారు.
మృతుల వయసు సుమారు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండొచ్చని జీఆర్పీ అధికారులు భావిస్తున్నారు. సంఘటనా స్థలంలో లభించిన ఆధారాల ఆధారంగా మృతుల గుర్తింపుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఓ మహిళా మృతదేహం వద్ద లభించిన ఏటీఎం కార్డు పై ‘షేక్ హసీనా’ అనే పేరు ఉండగా, మరో మహిళ వద్ద తాడేపల్లిగూడెం RTC డిపోలో బైక్ పార్కింగ్ రసీదు లభించింది.
స్థలంలో రెండు మొబైల్ ఫోన్లు కూడా లభించాయి. అయితే అవి ప్రమాదంలో ధ్వంసమయ్యాయి. వాటిలోని SIM కార్డులను వేరే చరవాణుల్లో అమర్చి కాల్ డేటా, ఇతర వివరాలను పరిశీలించి మృతుల పూర్తి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
మృతదేహాలను తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి, పోస్టుమార్టం నిర్వహించేందుకు వైద్యులకు అప్పగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు జీఆర్పీ ఎస్సై అప్పారావు తెలిపారు.







