పెనుకొండ నియోజకవర్గంలో సాగు, తాగునీటి అవసరాలను తీర్చడంతో పాటు నీటి వనరులను సద్వినియోగం చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జలాధార కార్యక్రమం పనులను వేగవంతంగా పూర్తి చేస్తున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత జౌళి శాఖల మంత్రి శ్రీమతి సవిత తెలిపారు.

గోరంట్ల మండలం గౌనివారిపల్లి పంచాయతీలో జరుగుతున్న జలాధార పనులను బుధవారం మంత్రి సవిత పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యతా ప్రమాణాలు కచ్చితంగా పాటిస్తూ, నిర్ణీత గడువులో పనులను పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా జలాధార పనులు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. పెనుకొండ నియోజకవర్గంలో సుమారు రూ.3 కోట్ల వ్యయంతో 43 జలాధార పనులు చేపట్టినట్లు వివరించారు. వర్షపు నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంపొందించడం, చెరువులు, నీటి వనరులను అభివృద్ధి చేయడం ద్వారా రైతులకు, ప్రజలకు ప్రయోజనం కల్పించడమే జలాధార కార్యక్రమం ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి భవిష్యత్ అవసరాలకు ఉపయోగపడేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి స్పష్టం చేశారు. జలాధార పనుల అమలుతో భూగర్భ జలమట్టాలు పెరిగి, సాగునీటి లభ్యత మెరుగుపడటంతో పాటు రైతులకు గణనీయమైన మేలు కలుగుతుందని ఆమె పేర్కొన్నారు.

ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనుల్లో నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని మంత్రి సవిత సూచించారు. అధికారులు, కాంట్రాక్టర్లు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ, పనుల అమలులో పారదర్శకతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచనలు చేశారు. జలాధార పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజల వినియోగానికి అందుబాటులోకి తీసుకురావాలని ఆమె ఆదేశించారు.

జలాధార పనుల పరిశీలన కార్యక్రమంలో మండల కూటమి నాయకులు, కార్యకర్తలు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.