శ్రీ సత్య సాయి జిల్లా:- వర్షాకాలం ప్రారంభమైనా తాగునీటి సమస్య నుంచి విముక్తి కలగకపోవడంతో శ్రీ సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారం రోజులుగా గ్రామంలో తాగునీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ గురువారం ఖాళీ బిందెలతో ప్రధాన రహదారిపైకి వచ్చి ధర్నా నిర్వహించారు.

తాగునీటి సమస్యను పలుమార్లు సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటివరకు ఎలాంటి స్పందన రాలేదని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రోజువారీ అవసరాలకు కావాల్సిన నీటికోసం కూడా తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోందని వారు పేర్కొన్నారు. ఇంటి పనులు, పిల్లల అవసరాలు, వృద్ధుల సంరక్షణ వంటి ప్రతీ విషయంలో నీటి కొరత తీవ్ర ప్రభావం చూపుతోందని మహిళలు తెలిపారు.

“గుక్కెడు నీటి కోసం ఇన్ని ఇబ్బందులా?”

అని ప్రశ్నిస్తూ గ్రామంలోని తాగునీటి సమస్యను వెంటనే పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. క్రమం తప్పకుండా తాగునీటి సరఫరా జరిగేలా శాశ్వత చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామంలో బోరుబావులు ఎండిపోవడం, పైపులైన్ ద్వారా నీటి సరఫరా అంతరాయం కలగడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని గ్రామస్థులు తెలిపారు.

తమ సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు ద్వారా నిరసన వ్యక్తం చేస్తామని మహిళలు హెచ్చరించారు. తాగునీటి సమస్యను పట్టించుకోని ప్రజాప్రతినిధులకు, అధికారులకు ఓటుతో బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందని వారు అభిప్రాయపడ్డారు.

గ్రామంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అవసరమైతే అదనపు బోరుబావులు త్రవ్వడం, ఉన్న పైపులైన్‌లను మరమ్మతు చేయడం, నీటి నిల్వ ట్యాంకులను ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రజల ప్రాథమిక అవసరమైన తాగునీటి సమస్యను అత్యవసరంగా పరిగణించి చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను వారు విజ్ఞప్తి చేస్తున్నారు.