రాయలసీమ న్యూస్, శ్రీ సత్యసాయి: పుట్టపర్తి: ఎల్ నీనో ప్రభావం, తీవ్ర వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి మరింత అండగా ఉందని, ఈ పరిస్థితుల్లో ‘రక్షక తడి’గా ప్రత్యామ్నాయ సాగుపై రైతులు దృష్టి సారించాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ సూచించారు. పుట్టపర్తి సాయి ఆరామం ప్రాంగణంలో ఎల్ నీనో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో రైతాంగానికి సన్నాహక చర్యలపై “ఎల్ నీనో పై కార్యాచరణ సమీక్ష సమావేశం” నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరై రైతులతో, వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా సాగు పరిస్థితులు, వర్షపాతం, పంటల బీమా, పశుగ్రాసం, ప్రకృతి వ్యవసాయ పద్ధతులు, నీటి యాజమాన్యంపై విస్తృతంగా చర్చించారు.
కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు సాధారణ సాగు విస్తీర్ణంలో 45 శాతం మాత్రమే పంటలు సాగయ్యాయని, ప్రతికూల వాతావరణం వల్ల 57 శాతం వరకు లోటు వర్షపాతం నమోదైందని తెలిపారు. ఇటువంటి క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లోనూ ప్రకృతి వైపరీత్యాలను తట్టుకుని వ్యవసాయ, ఉద్యానవన పంటల్లో అద్భుతమైన దిగుబడులు సాధిస్తున్న జిల్లా రైతుల శ్రమను ఆయన ప్రశంసించారు.
ప్రస్తుత తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో పంటలకు అవసరమైన మోతాదులోనే నీటిని అందిస్తూ నీటి యాజమాన్య పద్ధతులు ఖచ్చితంగా పాటించాలని రైతులకు సూచించారు. జిల్లాలోని అర్హులైన ప్రతి రైతును ఇప్పటికే పంటల బీమా (Crop Insurance) పరిధిలోకి నమోదు చేసినట్లు స్పష్టం చేశారు.
రాబోయే రోజుల్లో వర్షం కురిసే అవకాశాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు వీలుగా 80 శాతం రాయితీపై పంపిణీ చేయడానికి 16,000 క్వింటాల విత్తనాల కోటాను సిద్ధంగా ఉంచినట్లు కలెక్టర్ వెల్లడించారు. జిల్లాలో పశుగ్రాసం కొరత తలెత్తకుండా ముందస్తు చర్యల్లో భాగంగా 1,000 ఎకరాల విస్తీర్ణంలో సామూహిక పశుగ్రాసం పెంచేందుకు సమగ్ర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
జిల్లాలో ఇప్పటికే 94,000 ఎకరాల్లో PMDS (ప్రకృతి వ్యవసాయ పద్ధతులు) ద్వారా వివిధ రకాల పంటలు సాగు చేస్తూ ఆశించిన ఉత్తమ ఫలితాలు సాధించినట్లు పేర్కొన్నారు. ఈ విజయవంతమైన మోడల్‌ను జిల్లాలో 2 లక్షల ఎకరాలకు విస్తరించాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
కురిసే ప్రతి వర్షపు చుక్కనూ వడిసిపట్టుకోవడానికి రైతులు తమ పొలాల్లో ‘పొలం కుంటలు’ తవ్వుకోవాలని, వర్షాభావ సమయంలో ఇవే పంటలకు అత్యంత కీలకమైన “రక్షక తడి” అందించేందుకు సహాయపడతాయని వివరించారు. బోర్ వెల్ సౌకర్యం ఉన్న ప్రతి రైతు తప్పనిసరిగా డ్రిప్, బిందు సేద్య పరికరాలను ఉపయోగించి నీటి వృథాను అరికట్టాలని సూచించారు.
సమావేశ ప్రాంగణంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు నూతనంగా అభివృద్ధి చేసిన “మట్టి నమూనా పరీక్ష కిట్” పనితీరును రైతుల ఎదుట ప్రత్యక్షంగా ప్రదర్శించారు. నూనె గింజల పరిశోధన స్థానం వారు నూతనంగా రూపకల్పన చేసిన ఆముదం విత్తనాలను ప్రయోగాత్మక సాగు కోసం ఎంపిక చేసిన కొందరు రైతులకు పంపిణీ చేశారు.
ఇదే వేదికపై జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో, అత్యుత్తమ సేద్యపు పద్ధతుల్లో ఆదర్శంగా నిలిచిన పలువురు ప్రగతిశీల రైతులను కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఘనంగా సన్మానించారు.
ఈ సమీక్షా సమావేశం, వర్క్‌షాప్‌లో NAARM శాస్త్రవేత్తలు రమేష్ నాయక్, సురేష్ కుమార్, జిల్లా వ్యవసాయ అధికారి కృష్ణయ్య, DRDA PD నరసయ్య, DWM&A PD విజయకుమార్, APMIP PD దేవానంద, పట్టు పరిశ్రమ శాఖ అధికారిణి శోభారాణి, జిల్లా మార్కెటింగ్ అధికారి హాఫిజుల్లా, వ్యవసాయ శాస్త్రవేత్తలు భాస్కర్ రెడ్డి, చంద్రాయుడు, రామసుబ్బయ్య, జిల్లాలోని సహాయ వ్యవసాయ సంచాలకులు (ADA), వ్యవసాయ అధికారులు (AO), సహాయ అధికారులు, వివిధ స్వచ్ఛంద సంస్థల (NGO) ప్రతినిధులు, FPO ప్రతినిధులు, జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.













