రాయలసీమ న్యూస్, అనంతపురం: అనంతపురం జిల్లా అనంతలో మహిళల సాధికారతకు ఆర్డీటీ చేపట్టిన సేవలు ప్రశంసనీయమని జిల్లా కలెక్టర్ ఆనంద్ పేర్కొన్నారు. ఆర్డీటీ ఆధ్వర్యంలో 22 మంది మహిళలకు డ్రైవింగ్ శిక్షణ అందించి, వారికి ఆటోలను ఉచితంగా పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ ఆనంద్ మహిళలకు ఆటోలను అందజేశారు. స్థిరమైన ఆదాయం లేని మహిళలను గుర్తించి, వారికి ఉచిత శిక్షణతో పాటు ఆటోలను కూడా అందించడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆర్డీటీ ఈ కార్యక్రమాన్ని అమలు చేసింది.
శిక్షణ కాలంలో పాల్గొన్న మహిళలకు వసతి, భోజన సదుపాయాలను ఆర్డీటీ ఏర్పాటు చేసింది. డ్రైవింగ్ నేర్పడంతో పాటు వాహన నిర్వహణపై అవగాహన కల్పించి, రహదారి భద్రత నియమాలపై ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. మహిళలు సురక్షితంగా, బాధ్యతాయుతంగా వాహనాలు నడపగలిగేలా ప్రాయోగిక శిక్షణను కూడా అందించారు.
ఆర్డీటీ చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు స్థిరమైన ఆదాయ వనరులు లభించే అవకాశం ఉందని జిల్లా అధికారులు అభిప్రాయపడ్డారు. ఆటోలను ఉచితంగా అందించడం వల్ల ప్రారంభ పెట్టుబడి భారముండదని, స్వయం ఉపాధి ద్వారా కుటుంబాల ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశం ఉందని పేర్కొన్నారు.
అనంతపురం జిల్లాలో ఆర్డీటీ సేవలు మరువలేనివని కలెక్టర్ ఆనంద్ అభివర్ణించారు. మహిళల జీవన ప్రమాణాల మెరుగుదలకు, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాల సృష్టికి ఈ సంస్థ చేస్తున్న కృషి ప్రశంసనీయమని జిల్లా అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.













