రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్: న్యూఢిల్లీ: దేశంలో ప్లాస్టిక్ కరెన్సీ నోట్లను ప్రవేశపెట్టే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కీలక చర్యలు ప్రారంభించింది. తొలిదశలో రూ.10, రూ.20 విలువైన ప్లాస్టిక్ నోట్లపై ఫీల్డ్ ట్రయల్స్ నిర్వహించేందుకు ప్రయోగాత్మక ప్రక్రియను మొదలుపెట్టనున్నట్లు సమాచారం. ఇందుకోసం అవసరమైన ఏర్పాట్లు ఆర్బీఐ స్థాయిలో కొనసాగుతున్నాయి.
ఈ ప్లాస్టిక్ నోట్ల తయారీకి అవసరమైన ప్రత్యేక మెటీరియల్ను సరఫరా చేయడానికి అర్హత కలిగిన కంపెనీల నుంచి ప్రతిపాదనలను ఆహ్వానిస్తూ ఆర్బీఐ అనుబంధ సంస్థ భారతీయ రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ ప్రైవేట్ లిమిటెడ్ (BRBNMPL) చర్యలు చేపట్టింది. టెండర్ ప్రక్రియ ద్వారా మెటీరియల్ సరఫరాదారులను ఎంపిక చేసే దిశగా సంస్థ ముందుకు సాగుతోంది.
ప్రస్తుతం వినియోగంలో ఉన్న కాగితపు నోట్లతో పోలిస్తే ప్లాస్టిక్ నోట్లు మరింత మన్నికగా ఉండే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ప్లాస్టిక్ నోట్ల జీవితకాలం ఎక్కువగా ఉండడం వల్ల తరచుగా దెబ్బతినే చిన్న విలువ గల నోట్ల సమస్య కొంతవరకు తగ్గే అవకాశం ఉన్నదని ఆర్థిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. చిన్న నోట్ల మార్పిడి, రీప్లేస్మెంట్పై వచ్చే వ్యయాన్ని కూడా ప్లాస్టిక్ నోట్లు తగ్గించవచ్చని అభిప్రాయపడుతున్నారు.
ప్లాస్టిక్ కరెన్సీపై ఆలోచనలు కొత్తవి కావు. ఇప్పటికే 2012లోనూ ప్లాస్టిక్ నోట్లను ప్రయోగాత్మకంగా పరీక్షించే ప్రయత్నాలు జరిగిన విషయం తెలిసిందే. అయితే ఆ సమయంలో ఎదురైన సాంకేతిక సమస్యలు, తయారీ ప్రక్రియలో వచ్చిన ఇబ్బందుల కారణంగా ఆ ప్రాజెక్టు ముందుకు సాగలేదు. ఫలితంగా ఆ ప్రయత్నాన్ని ఆర్బీఐ నిలిపివేసింది.
ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన కొత్త సాంకేతిక పరిజ్ఞానం, మెరుగైన మెటీరియల్ ఎంపికల నేపథ్యంలో ప్లాస్టిక్ నోట్ల ప్రాజెక్టును మరోసారి పరిశీలిస్తున్నట్లు ఆర్బీఐ వర్గాలు సూచిస్తున్నాయి. అంతర్జాతీయంగా కొన్ని దేశాలు ఇప్పటికే ప్లాస్టిక్ కరెన్సీని వినియోగంలోకి తీసుకువచ్చిన నేపథ్యంలో, భారతదేశ పరిస్థితులకు అనుగుణంగా ఈ నోట్ల ప్రయోజనాలు, సవాళ్లను అధ్యయనం చేసి తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.






