రాయలసీమ న్యూస్, బిజినెస్ డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ కస్టమర్లకు సంబంధించిన ATM విత్ డ్రా, క్యాష్ ఉపసంహరణ నియమాల్లో కీలక మార్పులు చేసింది. శాలరీ అకౌంట్ హోల్డర్లతో పాటు బేసిక్ సేవింగ్స్ అకౌంట్ కలిగిన వారికి కొత్త పరిమితులు, ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. అక్టోబర్ 1 నుంచి ఈ కొత్త రూల్స్ దేశవ్యాప్తంగా అమలులోకి వస్తాయి.
శాలరీ అకౌంట్ హోల్డర్లకు ఇతర బ్యాంకుల ATMలలో ఉచిత లావాదేవీల సంఖ్యను ఎస్బీఐ సగానికి తగ్గించింది. ఇప్పటివరకు నెలకు 10 ఉచిత ట్రాన్సాక్షన్లు చేసుకునే అవకాశం ఉండగా, ఇకపై నెలకు 5 ఉచిత లావాదేవీలకే పరిమితం చేశారు. ఈ పరిమితిని దాటిన తర్వాత ఇతర బ్యాంకుల ATMలలో ప్రతి క్యాష్ విత్ డ్రా లావాదేవీపై రూ.23తో పాటు జీఎస్టీ వసూలు చేయనున్నారు.

నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ల (బ్యాలెన్స్ ఇన్క్వైరీ, మినీ స్టేట్‌మెంట్ వంటి సేవలు) విషయంలో కూడా ఎస్బీఐ కొత్త ఛార్జీలను ప్రకటించింది. ఉచిత పరిమితిని మించిన ప్రతి నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్‌పై రూ.11తో పాటు జీఎస్టీ విధించనున్నారు. ఈ మార్పులు శాలరీ అకౌంట్ హోల్డర్లకు వర్తించనున్నాయి.
ఇక బేసిక్ సేవింగ్స్ అకౌంట్ కలిగిన కస్టమర్లకు కూడా ఎస్బీఐ నగదు ఉపసంహరణపై కొత్త నియమాలను అమలు చేయనుంది. ఇప్పటివరకు ఈ ఖాతాదారులు ఎన్ని క్యాష్ విత్ డ్రా లావాదేవీలు చేసినా ఎలాంటి ఛార్జీలు లేకుండా ఉచితంగా చేసుకునే అవకాశం ఉండేది. అక్టోబర్ 1 నుంచి ఈ సౌకర్యాన్ని పరిమితం చేశారు.
కొత్త రూల్స్ ప్రకారం బేసిక్ సేవింగ్స్ అకౌంట్ ఉన్నవారు నెలకు నాలుగు క్యాష్ విత్ డ్రా లావాదేవీలు వరకు మాత్రమే ఉచితంగా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. నెలలో నాలుగు లావాదేవీలను మించిన తర్వాత ప్రతి అదనపు క్యాష్ విత్ డ్రాపై రూ.15తో పాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో తరచుగా నగదు ఉపసంహరణ చేసే బేసిక్ అకౌంట్ హోల్డర్లకు బ్యాంకింగ్ ఖర్చులు పెరిగే అవకాశం ఉంది.
అయితే డిజిటల్ లావాదేవీలపై ఎస్బీఐ ఎలాంటి ఛార్జీలు విధించడం లేదు. యూపీఐ, NEFT, RTGS, IMPS వంటి మార్గాల ద్వారా చేసే ట్రాన్సాక్షన్లు ఉచితంగానే కొనసాగుతాయని బ్యాంక్ స్పష్టం చేసింది. డిజిటల్ లావాదేవీలకు ఎలాంటి ఆంక్షలు లేకపోవడంతో, నగదు అవసరాన్ని తగ్గించుకుని డిజిటల్ పేమెంట్స్‌ను ప్రోత్సహించేలా ఈ మార్పులు ఉన్నట్లు బ్యాంకింగ్ వర్గాలు భావిస్తున్నాయి.
బ్రాంచ్ ఛానెల్ ద్వారా తెరవబడిన బేసిక్ సేవింగ్స్ అకౌంట్లకు ఈ కొత్త క్యాష్ విత్ డ్రా ఛార్జీలు వర్తిస్తాయి. నెలకు నాలుగు ఉచిత లావాదేవీల సౌకర్యం ఉండటంతో, సాధారణంగా తక్కువసార్లు నగదు ఉపసంహరణ చేసే కస్టమర్లపై ప్రభావం తక్కువగా ఉండొచ్చని అంచనా. అయితే లిమిట్ దాటే వారికి అదనపు ఛార్జీలు తప్పనిసరి కానున్నాయి.
బేసిక్ సేవింగ్స్ అకౌంట్ అనేది సాధారణంగా జీరో బ్యాలెన్స్ అకౌంట్‌గా పరిగణించబడుతుంది. ఈ ఖాతాలో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉండదు. ఉచితంగా ATM కార్డు అందించడంతో పాటు డెబిట్ కార్డు వార్షిక ఛార్జీలు కూడా ఉండవు. తక్కువ ఆదాయం కలిగినవారు, కొత్తగా బ్యాంకింగ్ వ్యవస్థలోకి వచ్చే వారికి ఈ ఖాతా ఉపయోగకరంగా ఉండటంతో, కొత్త ఛార్జీల నేపథ్యంలో నగదు వినియోగాన్ని తగ్గించి డిజిటల్ లావాదేవీల వైపు మళ్లడం మంచిదని బ్యాంకింగ్ నిపుణులు సూచిస్తున్నారు.






