ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ రాష్ట్రంలోని పాఠశాలల్లో క్రమశిక్షణను మరింత పటిష్ఠం చేయడానికి విద్యార్థుల హెయిర్ స్టైల్స్ మరియు వస్త్రధారణపై కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. స్కూళ్లకు వచ్చే విద్యార్థులు ఫ్యాషన్, ఫంకీ హెయిర్ కటింగ్స్, హెయిర్ కలరింగ్స్ జోలికి వెళ్లకుండా సంప్రదాయబద్ధమైన సాధారణ హెయిర్ కట్‌తో మాత్రమే హాజరుకావాలని స్పష్టం చేసింది.

ఇటీవలి కాలంలో పాఠశాల విద్యార్థులు రకరకాల ఫ్యాషన్ హెయిర్ స్టైల్స్, కలరింగ్స్, ఫంకీ కటింగ్‌లతో క్లాసులకు వస్తున్నారని విద్యాశాఖ దృష్టికి వచ్చింది. ఈ ధోరణి విద్యార్థుల మధ్య అసమానతలకు, క్రమశిక్షణా రాహిత్యానికి దారితీస్తోందని అధికారులు గుర్తించారు. దీనిని అరికట్టేందుకు హెయిర్ స్టైల్స్‌పై స్పష్టమైన నిబంధనలు అమలు చేయాలని నిర్ణయించారు.

విద్యార్థులందరూ ఒకే విధమైన క్రమశిక్షణతో, సమానత్వంతో కనిపించేలా ‘యూనిఫాం హెయిర్ స్టైల్’ విధానాన్ని తప్పనిసరి చేశారు. ఈ క్రమంలో బాలురు ఎటువంటి మోడరన్ కటింగ్‌లు, స్పైక్స్, సైడ్ కట్, లాంగ్ హెయిర్ వంటి స్టైల్స్ లేకుండా కేవలం సాధారణ హెయిర్ కట్‌తోనే స్కూలుకు రావాలని ఆదేశించారు. బాలికలు జుట్టును సరిగ్గా దువ్వి, రెండు జడలు లేదా పాఠశాల నిబంధనల ప్రకారం అల్లుకుని రావాల్సి ఉంటుంది.

విద్యాశాఖ మార్గదర్శకాలు కేవలం విద్యార్థులకే కాకుండా పాఠశాల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై కూడా బాధ్యతలను ఉంచాయి. ప్రతీరోజు ఉదయం ప్రేయర్ సమయంలోనే ఉపాధ్యాయులు విద్యార్థుల హెయిర్ స్టైల్, గోళ్లు, వస్త్రధారణను తనిఖీ చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించే విద్యార్థుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశారు.

స్కూల్ వాతావరణం చదువుకు అనుకూలంగా, సమానత్వంతో, క్రమశిక్షణతో ఉండేలా చూడడమే ఈ చర్యల ప్రధాన లక్ష్యమని విద్యాశాఖ స్పష్టం చేసింది. ఫ్యాషన్, ఫంకీ స్టైల్స్ ప్రభావం విద్యార్థుల ప్రవర్తనపై పడకుండా, పాఠశాలలను విద్యా కేంద్రాలుగా, క్రమశిక్షణా ప్రదేశాలుగా నిలబెట్టేందుకు ఈ నిబంధనలు ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు.