రాయలసీమ న్యూస్, ఎడ్యుకేషన్ డెస్క్: మహిళల ఉన్నత విద్యకు చిరునామాగా నిలిచిన శ్రీపద్మావతి మహిళా వర్సిటీ సాంకేతిక విద్యలో మరో కీలక ముందడుగు వేసింది. వేగంగా మారుతున్న సాంకేతిక ప్రపంచం, మార్కెట్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ విద్యాసంవత్సరం నుంచి బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ (ఏఐడీఎస్) కోర్సును ప్రారంభించింది. ప్రతిభావంతులకే కాకుండా చదువులో వెనుకబడిన విద్యార్థినులు కూడా అధిక మార్కులు సాధించేందుకు ప్రత్యేక రెమిడియల్ తరగతులు నిర్వహిస్తూ, ప్రాంగణ ఎంపికల్లో గణనీయమైన ఫలితాలు సాధిస్తోంది.
ప్రస్తుతం ఇంజినీరింగ్ కళాశాలలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ), ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్ (ఈసీఈ), ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ (ఈఈఈ), మెకానికల్ ఇంజినీరింగ్ కోర్సులు కొనసాగుతున్నాయి. ఈ ఏడాది ఏఐడీఎస్ కోర్సు ప్రవేశపెట్టడంతో విద్యార్థినులకు అత్యాధునిక సాంకేతిక రంగంలో కొత్త అవకాశాలు లభించనున్నాయి.
సీట్ల పునర్వ్యవస్థీకరణలో భాగంగా సీఎస్‌ఈ, ఈసీఈ విభాగాల్లో 120 చొప్పున, ఈఈఈలో 60 సీట్లు యథాతథంగా కొనసాగిస్తున్నారు. అయితే విద్యార్థినుల ప్రవేశాలు ఆశించినంతగా లేకపోవడంతో మెకానికల్ ఇంజినీరింగ్ విభాగంలో సీట్లను 60 నుంచి 30కి తగ్గించారు. కొత్తగా ప్రారంభించిన ఏఐడీఎస్ కోర్సుకు 60 సీట్లు కేటాయించారు. మార్కెట్ అవసరాలు, పరిశ్రమల ధోరణులకు అనుగుణంగా కోర్సుల పునర్వ్యవస్థీకరణ చేపట్టినట్లు అధికారులు పేర్కొన్నారు.
మహిళలకు నాణ్యమైన ఇంజినీరింగ్ విద్య అందించాలనే లక్ష్యంతో 2006లో వర్సిటీలో ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించారు. తొలి దశలో సీఎస్‌ఈ, ఐటీ, ఈసీఈ, ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ (ఐబీటీ) కోర్సులు అందుబాటులో ఉండేవి. కాలక్రమేణా విద్యార్థినుల ఆసక్తి తగ్గడం, పరిశ్రమల అవసరాల్లో వచ్చిన మార్పులను పరిశీలించి 2013, 2014లో ఐటీ, ఐబీటీ కోర్సులను నిలిపివేసి, వాటి స్థానంలో మెకానికల్, ఈఈఈ కోర్సులను ప్రవేశపెట్టారు. ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఏఐడీఎస్ కోర్సును ప్రారంభించారు.
కళాశాలలో బీటెక్, ఎంటెక్ కోర్సుల్లో 1500 మందికిపైగా విద్యార్థినులు ఇంజినీరింగ్ విద్యను అభ్యసిస్తున్నారు. వీరికి 75 మంది అధ్యాపకులు బోధనా సేవలు అందిస్తున్నారు. నాణ్యమైన బోధన, ప్రయోగాత్మక విద్యపై కళాశాల ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఇంజినీరింగ్ కళాశాల సంచాలకులు మల్లికార్జున తెలిపారు.
ఎంటెక్ స్థాయిలో కూడా ఆధునిక స్పెషలైజేషన్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. సీఎస్‌ఈ విభాగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్, ఈసీఈలో వైర్‌లెస్ కమ్యూనికేషన్స్, ఈఈఈలో పవర్ ఎలక్ట్రానిక్స్ అండ్ డ్రైవ్స్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో రోబోటిక్స్ వంటి స్పెషలైజేషన్ కోర్సులు నిర్వహిస్తున్నారు.
ఇంజినీరింగ్ విద్యలో ప్రాక్టికల్ పరిజ్ఞానం ప్రాధాన్యాన్ని దృష్టిలో పెట్టుకుని కళాశాలలో మొత్తం 25 ఆధునిక ప్రయోగశాలలను ఏర్పాటు చేశారు. అదనంగా ప్రత్యేక వర్క్‌షాప్ ద్వారా కార్పెంట్రీ, వెల్డింగ్, వైరింగ్ వంటి ప్రాథమిక ఇంజినీరింగ్ నైపుణ్యాలను ప్రత్యక్షంగా నేర్పిస్తున్నారు. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా క్వాంటం ల్యాబ్, టింకరింగ్ ల్యాబ్, ఆప్టికల్ కమ్యూనికేషన్ ల్యాబ్ వంటి సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా విద్యార్థినులు సరికొత్త సాంకేతిక అంశాలపై ప్రయోగాలు చేస్తూ పరిశోధనా దృక్పథాన్ని పెంపొందించుకుంటున్నారు.
ప్రాంగణ నియామకాలకు ముందు కమ్యూనికేషన్ స్కిల్స్, టెక్నికల్ నాలెడ్జ్, ఇంటర్వ్యూ టెక్నిక్స్, ఆప్టిట్యూడ్, గ్రూప్ డిస్కర్షన్స్ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నారు. అమెజాన్, విప్రో, ఇన్ఫోసిస్, అసెంచర్, సీటీఎస్, ఐబీఎం, యూనిసిస్, జోహో వంటి 40కిపైగా సంస్థలు ప్రాంగణ ఎంపికలు నిర్వహించగా వెయ్యికిపైగా విద్యార్థినులు సాఫ్ట్‌వేర్ ఉద్యోగాలు సాధించారు.







