తెలుగు రాష్ట్రాల్లో ఇంజినీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ వేగం పుంజుకుంది. టీజీఎప్ సెట్ ద్వారా ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు కీలకమైన వెబ్ ఆప్షన్ల నమోదు ఈ నెల 25 నుంచి ప్రారంభం కానుందని టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన ప్రకటించారు. విద్యార్థులు జూన్ 25 నుంచి జూలై 1 వరకు తమకు నచ్చిన కాలేజీలు, కోర్సులను వెబ్ ఆప్షన్ల ద్వారా ఎంచుకునే అవకాశం ఉంటుంది.

రాష్ట్రవ్యాప్తంగా 175 ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తం 1,14,007 సీట్లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో కన్వీనర్ కోటా కింద 81,620 సీట్లను భర్తీ చేయనున్నారు. రాష్ట్రంలో యూనివర్సిటీ, సర్కారు ఇంజినీరింగ్ కాలేజీలు 22, ప్రైవేట్ యూనివర్సిటీలు రెండు, ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలు 151 ఉన్నాయి. సర్కారు, యూనివర్సిటీ కాలేజీల్లో కలిపి 6,046 సీట్లు ఉండగా, ఇవన్నీ కన్వీనర్ కోటాలోనే భర్తీ చేయనున్నారు.

ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లో 1,06,701 సీట్లు, రెండు ప్రైవేట్ యూనివర్సిటీల్లో 1,800 సీట్లు ఉన్నాయి. వీటిలో ప్రైవేట్ కాలేజీల్లో 74,314, ప్రైవేట్ యూనివర్సిటీల్లో 1,260 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి. జేఎన్టీయూహెచ్ పరిధిలోని 133 ప్రైవేట్ కాలేజీల్లో 65 వేలకుపైగా కన్వీనర్ సీట్లు ఉన్నాయి. ఓయూ పరిధిలో 14 కాలేజీల్లో 7,833 సీట్లు, కేయూ పరిధిలో నాలుగు ప్రైవేట్ కాలేజీల్లో 1,103 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి.

గతేడాది కన్వీనర్ కోటాలో మొత్తం 91,640 సీట్లు ఉండగా, ఈసారి దాదాపు పది వేల వరకు తగ్గినట్లు అధికారులు తెలిపారు. అయితే ఇంకా కొన్ని కోర్సుల్లో సీట్లతో పాటు కొత్త కోర్సుల సీట్లు జోడించాల్సి ఉందని స్పష్టం చేస్తున్నారు.

ఇంజినీరింగ్ కాలేజీల్లో మెజార్టీ సీట్లు కంప్యూటర్ సైన్స్, దాని అనుబంధ బ్రాంచ్‌ల్లోనే ఉన్నాయి. ఆయా కోర్సుల్లో మొత్తం 81,768 సీట్లు ఉండగా, వాటిలో 58,038 సీట్లు కన్వీనర్ కోటాలో ఉన్నాయి. ఇందులో సీఎస్‌ఈ బ్రాంచ్‌లోనే కన్వీనర్ కోటాలో 27,431 సీట్లు ఉండటం విశేషం. ఆ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ విభాగాల్లో 15,795 సీట్లు, సివిల్, మెకానికల్ వంటి కోర్ గ్రూపుల్లో కేవలం 6,871 సీట్లు, ఇతర గ్రూపుల్లో మరో 916 సీట్లు కన్వీనర్ కోటాలో అందుబాటులో ఉన్నాయి.

మెరుగైన కాలేజీలో సీటు పొందాలనుకునే అభ్యర్థులు వీలైనన్ని ఎక్కువ ఆప్షన్లు ఇవ్వాలని, కాలేజీ కోడ్, బ్రాంచ్ కోడ్‌లను జాగ్రత్తగా పరిశీలించి ముందుగా మాన్యువల్ ఆప్షన్ ఫారమ్ నింపుకుని తర్వాతే ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని అడ్మిషన్ల కన్వీనర్ శ్రీదేవసేన సూచించారు. లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఎవరికీ ఇవ్వకూడదని, సెక్యూరిటీ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్‌సైట్ https://tgeapcet.nic.in చూడాలని సూచించారు.

కౌన్సెలింగ్ కోసం ఇప్పటివరకు 84,002 మంది అభ్యర్థులు ప్రాసెసింగ్ ఫీజు చెల్లించి స్లాట్ బుక్ చేసుకున్నారు. వీరిలో 36,393 మంది సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను పూర్తి చేశారు. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు జూన్ 29 వరకు గడువు ఉంది. ర్యాంకుల వారీగా చూస్తే, 10 వేల లోపు ర్యాంకు సాధించిన వారిలో దాదాపు 6,700 మంది ఇప్పటికే స్లాట్ బుక్ చేసుకున్నారు. వందలోపు ఐదుగురు, ఐదు వందల లోపు ర్యాంకులున్న వారు 47 మంది, వెయ్యిలోపు ర్యాంకులున్న వారిలో 182 మంది మాత్రమే స్లాట్ బుక్ చేసినట్లు అధికారులు తెలిపారు.