బాలీవుడ్‌ నటుడు ఆమిర్‌ ఖాన్‌ (61) శుక్రవారం బెంగళూరులో వివాహ బంధంలోకి అడుగుపెట్టనున్నారు. తన స్నేహితురాలు గౌరి స్ట్రాట్‌ (47)తో అక్కడి ఒక రిసార్టులో ఆయన మూడో వివాహం జరగనుందని సమాచారం. ఆమిర్‌ ఖాన్‌ గతంలో రీనాదత్తా, కిరణ్‌ రావుతో వివాహ బంధంలో ఉన్న విషయం తెలిసిందే. ఇద్దరికీ విడాకులు ఇచ్చి, దూరమైన అనంతరం ఆయన వ్యక్తిగత జీవితం గురించి బాలీవుడ్‌లో, సామాజిక మాధ్యమాల్లో తరచూ చర్చ నడిచింది. ఈ నేపథ్యంలోనే ఆయనకు గౌరి స్ట్రాట్‌తో గత కొన్నేళ్లుగా సన్నిహిత సంబంధం కొనసాగుతున్నట్టు సినీ వర్గాల్లో ప్రచారం ఉంది.

గౌరి స్ట్రాట్‌కు ఏడేళ్ల కుమార్తె ఉంది. వ్యక్తిగత జీవితంతో పాటు ఆమె వ్యాపార రంగంలోనూ చురుకుగా ఉంటున్నారు. బెంగళూరు, ముంబయి నగరాల్లో గౌరి స్ట్రాట్‌ నిర్వహిస్తున్న సెలూన్లు మంచి గుర్తింపు తెచ్చుకున్నాయి. స్థానిక ప్రముఖులు, సినీ, ఫ్యాషన్‌ రంగాలకు చెందిన పలువురు ఆమె సేవలను వినియోగించుకుంటున్నట్టు తెలిసింది. విద్యా రంగంలోనూ గౌరి స్ట్రాట్‌ మంచి ప్రస్థానం కలిగి ఉన్నారు. బ్లూ మౌంటెయిన్‌ పాఠశాలలో చదివిన ఆమె, అనంతరం 2004లో లండన్‌ విశ్వవిద్యాలయంలో ఫ్యాషన్‌ కోర్సు పూర్తి చేశారు. అదనంగా FDA స్టైలింగ్‌, ఫొటోగ్రఫీ కోర్సులను కూడా పూర్తి చేసి, ఆ రంగాల్లో నైపుణ్యం సాధించారు.

ఆమిర్‌ ఖాన్‌–గౌరి స్ట్రాట్‌ వివాహానికి సంబంధించి అధికారిక ప్రకటన, అతిథుల జాబితా, వేడుకల వివరాలు మాత్రం ఇంకా వెలువడలేదు. అయితే బాలీవుడ్‌ వర్గాల్లో ఈ పెళ్లి గురించి చర్చలు జోరుగా సాగుతున్నాయి. బెంగళూరులోని రిసార్టులో సన్నిహిత బంధువులు, స్నేహితుల సమక్షంలోనే ఈ వేడుకను సాదాసీదాగా నిర్వహించే అవకాశమున్నట్టు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆమిర్‌ ఖాన్‌ వ్యక్తిగత జీవితం, ఆయన తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ అభిమానుల్లో ఆసక్తి రేపుతూనే ఉన్నాయి. గౌరి స్ట్రాట్‌తో ఆయన మూడో వివాహం వార్త ప్రస్తుతం బాలీవుడ్‌, సోషల్‌ మీడియాల్లో చర్చనీయాంశంగా మారింది.