రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: స్వచ్ఛమైన ప్రేమ ఎలా ఉంటుందో చూపించే కథతో రూపొందిన చిత్రం ‘చెన్నై లవ్‌స్టోరీ’ని పక్కా మాస్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు చిత్రబృందం తెలిపింది. కిరణ్ అబ్బవరం, శ్రీగౌరీప్రియ జంటగా నటించిన ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహించారు. సాయిరాజేశ్ కథను అందించగా, ఆయన ఎస్.కె.ఎన్‌తో కలిసి నిర్మించారు. జులై 24న సినిమా విడుదల కానుంది.
కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సినిమా గురించి విశేషాలు వెల్లడించారు.
ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా. కొన్నేళ్ల ప్రయాణం తర్వాత ఓ సాయంకాలం నేను చేసిన సినిమాల్ని తిరిగి చూసుకోవాలనిపిస్తే ఆ జాబితాలో ప్రముఖంగా కనిపిస్తుంది ‘చెన్నై లవ్‌స్టోరీ’. నేను ఈ సినిమా విజయంపై పూర్తి నమ్మకంతో ఉన్నా. ఎంత పోటీ ఉన్నా ఈ నెల 24నే ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం. ఒక అమ్మాయిని ఇంతలా ప్రేమించవచ్చా అని ఆశ్చర్యపోయేలా చేస్తుందీ చిత్రం. ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అయ్యే కథ. పక్కా మాస్ సినిమా ఇది. ఐదారేళ్లుగా సాగుతున్న ఈ ప్రయాణంలో ఎంతో ప్రేమని సంపాదించా. మంచి సినిమాలు చేసి ఆదరణ పొందాలన్నదే నిత్యం నా ప్రయత్నం. సినిమాపై ప్రేమతోనే నిర్మాతగా, దర్శకుడిగా మారా.
కథా రచయిత, నిర్మాత సాయిరాజేశ్ కూడా చిత్ర విశేషాలను వివరించారు.
ఈ కథ చెప్పగానే కిరణ్ అబ్బవరం ‘మీపై నమ్మకం ఉంది, మీరు ఎంత తపనతో సినిమా చేస్తారో తెలుసు’ అన్నారు. అప్పట్నుంచి ఇప్పటివరకూ ఏ విషయంలోనూ జోక్యం చేసుకోకుండా సినిమాకోసం కష్టపడుతున్నారు. ఈ సినిమాతో కిరణ్‌కు నటుడిగా చాలా పేరొస్తుంది. నేను రాసిన కథలన్నీ దర్శకత్వం చేయలేను. అందుకే నా స్నేహితుడు రవికి దర్శకత్వ బాధ్యతలు అప్పజెప్పాను. చెన్నై నగరానికీ, ఈ కథకీ సంబంధం ఉంది. అందుకే ఈ పేరు పెట్టాం. సంగీత దర్శకుడు మణిశర్మ ఎంతో నాణ్యమైన సంగీతం సమకూర్చార.
మరో నిర్మాత ఎస్.కె.ఎన్. సినిమా బృందం పనితీరును ప్రశంసించారు.
కిరణ్, శ్రీగౌరీప్రియ అద్భుతమైన నటనని ప్రదర్శించారు. రవి నంబూరి అనుభవజ్ఞుడైన దర్శకుడిలా తెరకెక్కించారు. మేం గతంలో తీసిన ‘బేబి’, ఇప్పుడొస్తున్న ‘చెన్నై లవ్‌స్టోరీ’ రెండూ భిన్నమైన కథలతో రూపొందిన చిత్రాలు. ‘బేబి’ తరహాలోనే ఇది కూడా ప్రేక్షకులపై ఓ ముద్ర వేస్తుంది.
దర్శకుడు రవి నంబూరి కథ నేపథ్యం, పాత్రల గురించి వివరించారు.
స్టీవెన్ శంకర్, నివి అనే జంట మధ్య సాగే ప్రేమకథ ఇది. అందమైన సంభాషణలు ఉంటాయి. చెన్నై నేపథ్యం అయితే కొత్తగా ఉంటుందని నమ్మాం.
పలు పార్శ్వాలున్న పాత్రను ఈ చిత్రంలో పోషించానని శ్రీగౌరీప్రియ సమావేశంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సహ నిర్మాత ధీరజ్ మొగిలినేని, నటి సిరి హన్మంతు తదితరులు పాల్గొన్నారు.







