రాయలసీమ న్యూస్, మూవీ రివ్యూస్ డెస్క్: మలయాళ సినిమాలకు తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువ చర్చ జరుగుతోంది మలయాళ చిత్రాల గురించే అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్‌కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఏర్పడింది. ప్రస్తుతం ఆయన మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘వారణాసి’లో నటిస్తుండటంతో, ఆయన సినిమాలకు తెలుగు రాష్ట్రాల్లో మరింత డిమాండ్ పెరిగింది.
ఈ నేపథ్యంలో పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా నటించిన మలయాళ చిత్రం ‘I, Nobody’ (ఐ నో బడీ) జూలై 10, 2026న తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. E4 ఎక్సపెరిమెంట్స్ , ప్రిథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో Sri స్రవంతి మూవీస్ బ్యానర్‌పై రామ్ పెదనాన్న రవి కిశోరె విడుదల చేస్తున్నారు. మలయాళ థ్రిల్లర్‌లకు ఉన్న ఆదరణతో ఈ చిత్రంపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి.
కథ విషయానికి వస్తే – రాజీవ్ (పృథ్వీరాజ్ సుకుమారన్) ఒక ప్రభుత్వ ఉద్యోగి. అతని భార్య Meera (పార్వతి తిరువోతు) కూడా ఉద్యోగం చేస్తుంది. దంపతులకు ఇద్దరు కుమార్తెలు. అయితే రాజీవ్, Meera మధ్య సఖ్యత ఉండదు. చిన్న చిన్న విషయాలకే ఇద్దరూ తరచూ గొడవపడుతుంటారు. ఈ సమయంలో Meera ఒక ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్‌తో ఎఫైర్‌లో ఉందని రాజీవ్‌కు తెలుస్తుంది. దీంతో అతను మానసికంగా కుంగిపోతాడు.
ఒకరోజు ఈ విషయంపై ఆ బ్యాంక్ మేనేజర్‌ను కలిసి వార్నింగ్ ఇవ్వాలని భావించిన రాజీవ్ బ్యాంక్‌కు వెళ్తాడు. అదే సమయంలో ఊహించని విధంగా నలుగురు దొంగలు బ్యాంక్‌లోకి ప్రవేశిస్తారు. వారు రాజీవ్‌ను కిడ్నాప్ చేసి అక్కడి నుండి తప్పించుకోవాలని చూస్తారు. కానీ వారి ప్లాన్ విఫలమై రోడ్డు ప్రమాదంలో ఆ దొంగలంతా మరణిస్తారు. అయితే వారు దొంగిలించిన రూ.17 కోట్ల నగదు ఆచూకీని పోలీసులు గుర్తించలేరు. దీంతో ఆ డబ్బును రాజీవే దొంగిలించాడని అందరూ అనుమానించడం మొదలుపెడతారు.
పోలీసులు, రాజీవ్ ఫ్లాట్‌లోని వారు, ఆఫీస్‌లోని తోటి ఉద్యోగులు – అందరూ అతనిపై ఒత్తిడి తెస్తూ మానసికంగా వేధిస్తారు. ఇంకొందరు నేరుగా డబ్బు డిమాండ్ చేస్తూ అతనిపై దాడులు కూడా చేస్తారు. ఈ పరిస్థితుల్లో పిల్లల భవిష్యత్తు దృష్ట్యా Meera విడాకులు కోరుతుంది. ఆ తర్వాత రాజీవ్ జీవితం ఏ మలుపు తిరుగుతుంది? అసలు ఆ రూ.17 కోట్ల డబ్బు ఏమైంది? అనే ప్రశ్నలకు సమాధానమే మిగతా కథ.
నటీనటుల విషయానికి వస్తే – పృథ్వీరాజ్ సుకుమారన్ ఎలాంటి పాత్రలోనైనా ఇమిడిపోతాడనే విషయాన్ని ‘ఐ నో బడీ’ మరోసారి గుర్తుచేసింది. ఈ పాత్ర స్వభావం కొద్దిగా క్లిష్టమైనదే అయినా, ఆయన ఎంతో ఈజ్‌తో పోషించారు. యాక్షన్ సీన్లలో ఆయన నటన చాలా నేచురల్‌గా కనిపిస్తుంది. పార్వతి తిరువోతు కూడా సహజమైన నటనతో ఆకట్టుకుంది. పిల్లలు చేసిన పాత్రలు క్యూట్‌గా, నమ్మదగిన విధంగా ఉన్నాయి. ముఖ్యంగా అమల పాత్రలో కనిపించే చిన్నారి నటన ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. Anas, జాకబ్ పాత్రలు చేసిన నటులు కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు. మిగతా నటీనటులు సరైన స్థాయిలోనే నటించారు.
సాంకేతికంగా మలయాళ సినిమాల ప్రత్యేకతైన స్క్రీన్‌ప్లే, టీమ్‌వర్క్ ఈ చిత్రంలో కూడా కనిపిస్తుంది. సాధారణంగా అక్కడి చిత్రాల్లో అసలు కథా గమనం ప్రీ-క్లైమాక్స్‌లోనే స్పష్టంగా మొదలవుతుంది. కానీ మొదటి ఫ్రేమ్ నుంచే ప్రేక్షకుడిని కదలకుండా కూర్చోబెట్టడం వారి ప్రత్యేకత. ‘ఐ నో బడీ’లో కూడా ఫస్ట్ హాఫ్‌లో అసలు కథ ఏంటన్నది పూర్తిగా క్లియర్ కాకపోయినా, స్క్రీన్‌ప్లే ప్రేక్షకుడిని ఆకట్టుకుంటుంది. లిఫ్ట్ ఫైట్ సీక్వెన్స్, ఇంటర్వెల్ బ్లాక్ సెకండ్ హాఫ్‌పై ఎక్సైట్‌మెంట్ పెంచుతాయి.
అయితే కీలకమైన సెకండ్ హాఫ్ మాత్రం ఆశించినంత థ్రిల్లింగ్‌గా సాగదు. క్లైమాక్స్ భాగం బలహీనంగా అనిపిస్తుంది. హీరో కుటుంబం పెద్ద సమస్యలో చిక్కుకున్నప్పుడు, హీరో, హీరోయిన్ తీసుకునే నిర్ణయాలు, వారిని కాపాడటానికి ముఖ్యమంత్రి రంగంలోకి దిగే ఎపిసోడ్ – ఇవన్నీ రియాలిటీకి కొద్దిగా దూరంగా ఉంటాయి. దొంగలు దొంగిలించిన డబ్బు ఏమైంది అన్న ప్రధాన పాయింట్ కూడా సైడ్ ట్రాక్ అయిపోయిన భావన కలుగుతుంది. క్లైమాక్స్‌లో కేవలం డబ్బును చూపించి ముగించేసినట్టు అనిపిస్తుంది. ప్రాపర్ కన్క్లూజన్ లేకపోవడంతో ఫస్ట్ హాఫ్‌లో క్రియేట్ అయిన ఎక్సైట్‌మెంట్ కొంత తగ్గిపోయింది.
అయినా సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ వంటి సాంకేతిక విభాగాల మంచి అవుట్‌పుట్ సినిమా స్థాయి పడిపోకుండా కాపాడింది. నిర్మాణ విలువలు కూడా సంతృప్తికరంగా ఉన్నాయి.
మొత్తం మీద ‘ఐ నో బడీ’ ఆసక్తికరంగా మొదలై, బలమైన ఫస్ట్ హాఫ్‌తో ఆకట్టుకునే హాఫ్ బేక్డ్ థ్రిల్లర్‌గా నిలిచింది. లాజిక్ లేని సన్నివేశాలు, సెకండ్ హాఫ్‌లో థ్రిల్ తగ్గిపోవడం వల్ల చిత్రం యావరేజ్ స్థాయిలోనే ఆగిపోయింది.
రేటింగ్: 2.5/5 ( రివ్యూవర్ అభిప్రాయం మాత్రమే)







