రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: డ్యాన్సర్స్ అసోసియేషన్ లో జరుగుతున్న వివాదాలు, ఆరోపణల నేపథ్యంలో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చర్యలు ప్రారంభించింది. ఫెడరేషన్ పై విమర్శలు, వ్యాఖ్యల కారణంగా జానీ మాస్టర్ కు షోకాజ్ నోటీస్ జారీ చేసినట్టు సమాచారం.
ఇటీవల జానీ మాస్టర్ – శేఖర్ మాస్టర్ మధ్య జరిగిన వివాదం సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది. ఈ క్రమంలో డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ఉన్న లోపాలు, ఆరోపణలు బహిరంగంగా వెలుగులోకి వచ్చాయి. ముంబై డ్యాన్సర్లను తీసుకొస్తున్నారని జానీ మాస్టర్ పై ఆరోపణలు రావడంతో, ఆయన భార్య మరియు డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత మీడియా ముందుకు వచ్చి కొన్ని ఆరోపణలు చేశారు.
కొంతమంది డ్యాన్స్ మాస్టర్లు డ్యాన్సర్లకు డబ్బులు ఇవ్వకుండా అవినీతికి పాల్పడుతున్నారు. వాళ్లు వెళ్ళిపోతే కార్యవర్గం మొత్తం ఎందుకు ఎన్నికలు పెట్టాలి? మేము మంచి చేసినా తప్పు పడుతున్నారు. వాళ్ల తప్పులు ప్రశ్నించినందుకు మమ్మల్ని అంటున్నారు.
ఈ వివాదం పెద్దదిగా మారడంతో ఫిల్మ్ ఫెడరేషన్ కూడా ఇందులో జోక్యం చేసుకుంది. సుమలత, జానీ మాస్టర్ ఫెడరేషన్ విధానాలపై బహిరంగంగా విమర్శలు చేసినట్టు వార్తలు వెలువడ్డాయి.
మా అసోసియేషన్స్ అన్ని కలిస్తేనే ఫెడరేషన్ అవుతుంది. ఫెడరేషన్ ఇష్టానుసారంగా రూల్స్ పెడితే కుదరదు. ఫెడరేషన్ చెప్పినట్టు మేము నడుచుకోము. డ్యాన్సర్స్ అసోసియేషన్ లో ఇంటి దొంగలను ఫెడరేషన్ వాళ్లు సమర్థిస్తున్నారు. మాపై రూల్స్ రుద్దాలని చూస్తున్నారు.
ఈ వ్యాఖ్యలను ఫిల్మ్ ఫెడరేషన్ సీరియస్ గా తీసుకుంది. ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఈ నెల 14న విచారణకు హాజరుకావాలని జానీ మాస్టర్ ను పిలిచింది. అయితే ఆయన విచారణకు హాజరుకాలేదని ఫెడరేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
దీంతో జానీ మాస్టర్ కు షోకాజ్ నోటీస్ జారీ చేసింది ఫిల్మ్ ఫెడరేషన్. ఏడు రోజుల్లోగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఫెడరేషన్ తరఫున జానీ మాస్టర్ కు సహాయ నిరాకరణ చేస్తామని, బహిరంగంగా క్షమాపణలు చెప్పకపోతే క్రమశిక్షణాత్మక చర్యలు తప్పవని ఫెడరేషన్ స్పష్టం చేసింది.
అలాగే డ్యాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత తీరుపై కూడా ఫెడరేషన్ అసంతృప్తి వ్యక్తం చేసింది. జనరల్ బాడీ నిర్ణయాలకు కట్టుబడి ఉండాల్సిందేనని, డ్యాన్సర్ల ఉపాధికి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. ఫెడరేషన్ తీసుకోబోయే తదుపరి నిర్ణయం వరకు సహాయ నిరాకరణ కొనసాగుతుందని తెలిపింది.
ఫెడరేషన్ హెచ్చరికల నేపథ్యంలో జానీ మాస్టర్, సుమలత ఈ పరిణామాలపై ఎలా స్పందిస్తారన్నది ఇప్పుడు సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది.







