రాయలసీమ న్యూస్, ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: అందరికీ ముక్కుమీద కోపముంటే... కనకరాజుకు మాత్రం చేతల్లో ఉంటుంది. అతను చేసే పనులన్నీ అలా ఉంటాయి మరీ. కానీ ఓ అమ్మాయి అతని జీవితంలోకి వచ్చాక అంతా మారిపోయింది. ఉన్నట్టుండి ఆయన్ని కొరియన్ కనకరాజు అని పిలవడం మొదలుపెట్టారు. ఆ మార్పు వెనక కారణమేంటో తెలుసుకోవాలంటే ‘కొరియన్ కనకరాజు’ చిత్రాన్ని చూడాల్సిందే.
వరుణ్‌తేజ్ కథానాయకుడిగా, మేర్లపాక గాంధీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. రితికా నాయక్ కథానాయికగా నటిస్తోంది. యు.వి.క్రియేషన్స్‌తో కలిసి ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రాజీవ్ రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రేక్షకుల కోసం ఆగస్టు 7న సినిమాను విడుదల చేయాలని చిత్రబృందం నిర్ణయించింది.
ఈ నేపథ్యంలో సోమవారం టీజర్‌ను అగ్ర కథానాయకుడు ప్రభాస్ సామాజిక మాధ్యమాల వేదికగా విడుదల చేశారు. గ్రామీణ నేపథ్యంలోని పాత్రలతో, రాయలసీమ వాతావరణంలో సాగే కథాంశంతో టీజర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రారంభంలోనే కనకరాజు తన ఊరు, అక్కడి జనాల గురించి చెప్పే సంభాషణలు ఆసక్తిని రేకెత్తించాయి.
అందరికీ నమస్కారమప్పా... మా ఊరు పెనుగొండ. రాయలసీమ... మా ఊరు ఎంత అందంగా ఉంటుందో, మా జనాలు కూడా అంతే అందంగా ఉంటారప్పా...
ఈ సంభాషణతో మొదలైన టీజర్ కామెడీతో సరదాగా, హారర్ కోణంతో ఆసక్తికరంగా సాగింది. కనకరాజు పాత్రలో వరుణ్‌తేజ్ కొత్త తరహా హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌తో కనిపించాడు. గ్రామీణ నేపథ్యంలో సాగే కథలో హాస్యంతో పాటు భయానక అంశాలు, యాక్షన్, ఫాంటసీ మేళవింపుగా చూపించే ప్రయత్నం చేసినట్టు టీజర్ ద్వారా అర్థమవుతోంది.
సినీ వర్గాల సమాచారం ప్రకారం, గ్రామీణ నేపథ్యంలోని హాస్యంతోపాటు హారర్, యాక్షన్, ఫాంటసీ అంశాల మేళవింపుగా ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది. కనకరాజుగా సరికొత్త అవతారంలో వరుణ్‌తేజ్ కనిపించనున్నాడు. రాయలసీమ యాసలో ఆయన చెప్పే సంభాషణలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
ఈ చిత్రానికి సంగీతాన్ని తమన్ అందిస్తున్నారు. ఛాయాగ్రహణం బాధ్యతలను మనోజ్ రెడ్డి నిర్వహిస్తున్నారు. కూర్పు సత్య.జి చేతుల మీదుగా సాగుతోంది. టీజర్ విడుదలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. వరుణ్‌తేజ్ కెరీర్‌లో మరో విభిన్నమైన పాత్రగా కనకరాజు నిలుస్తాడని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.







