ఘట్టమనేని, నందమూరి మూడు తరాల హీరోలతో నటించిన మోహన్ బాబు.. అరుదైన రికార్డు

టాలీవుడ్ సినీ చరిత్రలో నటుడు మోహన్ బాబు కెరీర్‌కి ప్రత్యేకమైన ముద్ర ఉంది. హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆయన, తరువాత విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా, మళ్లీ హీరోగా నటిస్తూ విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. నటుడిగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా పలు చిత్రాలను నిర్మించిన రికార్డు ఈ సీనియర్ నటుడికి సొంతం.

తాజాగా సూపర్ స్టార్ కృష్ణ మనవుడు జయ కృష్ణ హీరోగా పరిచయం అవుతున్న ‘శ్రీనివాస మంగాపురం’ చిత్రంలో మోహన్ బాబు కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాలో ఆయన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. దీంతో ఘట్టమనేని కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలతో విలన్‌గా నటించిన అరుదైన రికార్డు మోహన్ బాబు ఖాతాలో చేరబోతోంది.

సూపర్ స్టార్ కృష్ణతో మోహన్ బాబు గతంలో అనేక చిత్రాల్లో విలన్‌గా, సైడ్ హీరోగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఆ తరువాత కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబు హీరోగా, దాసరి నారాయణ రావు దర్శకత్వంలో రూపొందిన ‘బ్లాక్ టైగర్’ సినిమాలో కూడా మోహన్ బాబు విలన్ పాత్రలో నటించారు.

ఇక సూపర్ స్టార్ కృష్ణ స్వీయ దర్శకత్వంలో మహేష్ బాబు బాల నటుడిగా ద్విపాత్రాభినయం చేసిన ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో మోహన్ బాబు కీలకమైన ప్రతినాయకుడి పాత్ర పోషించారు. ఇప్పుడు మూడో తరానికి చెందిన రమేష్ బాబు తనయుడు జయ కృష్ణ హీరోగా వస్తున్న ‘శ్రీనివాస మంగాపురం’లో కూడా విలన్‌గా కనిపించనుండటంతో, తాత, తండ్రి, బాబాయి, ఇప్పుడు మనవుడు – ఇలా ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలతో విలన్‌గా నటించిన నటుడిగా మోహన్ బాబు అరుదైన గుర్తింపు పొందుతున్నారు.

ఘట్టమనేని కుటుంబంతో పాటు నందమూరి వంశానికి చెందిన మూడు తరాల హీరోలతో కూడా మోహన్ బాబు స్క్రీన్ షేర్ చేశారు. పెద్ద ఎన్టీఆర్, బాలకృష్ణ, చిన్న ఎన్టీఆర్‌లతో ఆయన వివిధ చిత్రాల్లో నటించారు. దీంతో నందమూరి, ఘట్టమనేని మూడు తరాల హీరోలతో నటించిన వన్ అండ్ ఓన్లీ నటుడిగా మోహన్ బాబు ప్రత్యేక రికార్డు సృష్టించినట్టుగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.

నందమూరి మూడు తరాల హీరోలైన సీనియర్ ఎన్టీఆర్, బాలయ్య, జూనియర్ ఎన్టీఆర్‌లతో డైలాగ్ కింగ్ సాయికుమార్, శ్రీహరి వంటి నటులు కూడా స్క్రీన్ షేర్ చేసిన రికార్డు ఉంది. అయితే మోహన్ బాబు ఒక అడుగు ముందుకేసి, నందమూరి, ఘట్టమనేని రెండు కుటుంబాల మూడు తరాల హీరోలతో నటించిన నటుడిగా ప్రత్యేక స్థానం సంపాదించారు.

భవిష్యత్తులో అఖిల్ లేదా నాగ చైతన్యలతో నటించే అవకాశం వస్తే, అక్కినేని కుటుంబానికి చెందిన మూడు తరాల హీరోలతో కూడా మోహన్ బాబు నటించిన రికార్డు నమోదు కావచ్చు. ఏదేమైనా, ఒకే ఫ్యామిలీకి చెందిన మూడు తరాల హీరోలతో నటించడం సాధారణ విషయం కాదని సినీ పరిశ్రమలో పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.