‘శివుడి కుమారుడు... పార్వతి గర్వం... శాశ్వత సేనాపతి...’ అంటూ యుద్ధ దేవుడిగా కీర్తిని సొంతం చేసుకున్న కార్తికేయుడి జీవితగాథను ఆధారంగా చేసుకుని రూపొందుతున్న కొత్త చిత్రాన్ని అగ్ర హీరో ఎన్టీఆర్‌ అధికారికంగా ప్రకటించారు. ఎన్టీఆర్‌ ప్రధాన పాత్రలో ఈ చిత్రాన్ని దర్శకుడు త్రివిక్రమ్‌ తెరకెక్కించనున్నారు. ‘అరవింద సమేత’ తర్వాత ఈ ఇద్దరి కలయికలో వస్తోన్న తదుపరి చిత్రం ఇదే కావడం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

హారిక అండ్‌ హాసిని క్రియేషన్స్‌, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థల సంయుక్త నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. ఎస్‌. రాధాకృష్ణ (చినబాబు), నందమూరి కల్యాణ్‌రామ్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దైవిక అంశాలతో, పురాణాల ఆధారంగా రూపొందనున్న ఈ సినిమా గురించి చాలా రోజులుగా సినీ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడెప్పుడా అంటూ అభిమానుల్లో ఉత్సుకతను పెంచిన ఈ చిత్రాన్ని ఎట్టకేలకి చిత్రబృందం సోమవారం అధికారికంగా ప్రకటించింది.

కార్తికేయుడి పురాణగాథను ఆధారంగా చేసుకుని, భారీ హంగులతో రూపొందనున్న ఈ చిత్రానికి ప్రత్యేకమైన పోస్టర్‌ను విడుదల చేశారు. ‘ఒక ఈటె, ఒక లక్ష్యం, ఒక దైవిక తీర్పు...’ అనే శీర్షికతో వచ్చిన ఈ పోస్టర్‌ ద్వారా చిత్ర స్థాయి, విస్తృతిని సినీ వర్గాలు స్పష్టంగా తెలియజేశాయి.

‘‘లోతైన భావోద్వేగాలు, ఉత్కంఠ భరితమైన యుద్ధ సన్నివేశాలు, సరికొత్త కథాప్రపంచాన్ని ఆవిష్కరించే చిత్రమిది. ఎన్టీఆర్‌ నట విశ్వరూపానికి, మరోసారి త్రివిక్రమ్‌ కలం బలం తోడవడం, దైవిక అంశాలతో కూడిన కథాంశం కారణంగా ప్రేక్షకుల్లో మరిన్ని అంచనాలు పెరిగాయి. అందుకు దీటుగా సినిమా రూపొందుతుంది. అత్యున్నత స్థాయి సాంకేతిక బృందం ఈ చిత్రం కోసం పనిచేస్తుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి.

ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అనిరుధ్‌ పనిచేయనున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలోనే ప్రకటించనున్నట్లు చిత్రబృందం తెలిపింది. పురాణ గాథ, దైవిక అంశాలు, భారీ నిర్మాణ విలువలు, ఎన్టీఆర్‌ – త్రివిక్రమ్‌ విజయవంతమైన కలయిక కలిసి రావడంతో ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.