తిరువీర్ హీరోగా, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం ‘ఓ సుకుమారి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దర్శకుడు భరత్ దర్శన్ , “ఐశ్వర్య రాజేష్‌ను ముట్టుకుంటే షాక్ కొడుతుంది” అనే విభిన్నమైన కాన్సెప్ట్ చుట్టూ ఈ కథను అల్లాడు. మహేష్వార్ రెడ్డి ములి నిర్మించిన ఈ సినిమాకు భరత్ మంచిరోజు సంగీతం అందించాడు. ప్రమోషన్ల దశలోనే ఆసక్తిని రేకెత్తించిన ఈ చిత్రం థియేటర్లలో ఎంతవరకు ఆకట్టుకుందో ఇప్పుడు చూద్దాం.

కథ విషయానికి వస్తే… యాదగిరి (తిరువీర్) తెలంగాణ ప్రాంతానికి చెందిన ఓ పల్లెటూరిలో సర్పంచ్ కావాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అతనికి తమ్ముడు (గవిరెడ్డి)తో పెద్దగా కలిసిరాదు. వీరి తాత 80 ఎకరాల ఆస్తి విషయంలో “ఈ అన్నదమ్ముల్లో ఎవరికి ముందు మగ బిడ్డ పుడితే ఆస్తి అంతా వారిదే” అనే షరతుతో వీలునామా రాసి ఉంచుతాడు. దీంతో ఇద్దరూ పెళ్లి కోసం పోటీగా ప్రయత్నాలు మొదలు పెడతారు.

అన్నకంటే ముందే తమ్ముడు, అప్పటికే గర్భంతో ఉన్న ఒక మార్వాడీ అమ్మాయిని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. ఇదే సమయంలో యాదగిరి కూడా పెళ్లిచూపులు చూసేందుకు వెళ్లి, అదే ఊరికి చెందిన దామిని (ఐశ్వర్య రాజేష్)ను మొదటి చూపులోనే ఇష్టపడతాడు. ఆ తర్వాత ఆమె తండ్రితో మాట్లాడి దామినిని వివాహం చేసుకుంటాడు. అయితే “ఆమెను ముట్టుకుంటే షాక్ కొడుతుంది” అనే విషయాన్ని గ్రామస్తులు దాచిపెట్టి, అందరూ కలిసి ఆ పెళ్లిని జరిపిస్తారు.

శోభనం రాత్రి ఈ నిజం తెలిసిన యాదగిరి ఏం చేయాలో అర్థం కాక అయోమయానికి గురవుతాడు. దామినిని ముట్టుకుంటే ఎందుకు షాక్ తగులుతుంది? ఈ సమస్య వెనక అసలు కారణం ఏమిటి? ఈ విషయం తెలిసిన తర్వాత యాదగిరి ఏ నిర్ణయం తీసుకున్నాడు? తాత చెప్పిన 80 ఎకరాల ఆస్తి చివరికి ఎవరికి దక్కింది? అనే ప్రశ్నలకు సమాధానాలు పెద్ద తెరపై తెలుసుకోవాల్సిందే.

విశ్లేషణ పరంగా చూస్తే, హీరోయిన్‌కి లేదా హీరోకి ఒక ప్రత్యేక సమస్య పెట్టి, దాని చుట్టూ కథ నడిపే ధోరణి ఇటీవలి కాలంలో పెరిగింది. ‘ఓ సుకుమారి’ కూడా అలాంటి కోవకు చెందిన చిత్రమే. చిన్నప్పుడే జరిగిన అనుకోని ప్రమాదం వల్ల, ముట్టుకుంటే షాక్ కలిగే వింత సమస్యతో బాధపడే ఒక చిన్నారి… ఆమె పెద్దయ్యాక ఆ సమస్య వల్ల ఊరి జనానికి కలిగే ఇబ్బందులు… అనే ఆసక్తికరమైన లైన్‌ను దర్శకుడు ఎంచుకున్నాడు.

కథగా తీసుకుంటే పాయింట్ బాగానే ఉన్నప్పటికీ, దాన్ని తెరపై ప్రజెంట్ చేసే విషయంలో మాత్రం కొంత తడబాటు కనిపిస్తుంది. తెలంగాణ యాసలో వచ్చే కొన్ని వన్ లైనర్ కామెడీ సన్నివేశాలు బాగా పనిచేశాయి. కానీ మొత్తం సినిమా చూస్తున్నప్పుడు ప్రధాన ఘర్షణ పూర్తిగా వర్కౌట్ కాలేదనే భావన కలుగుతుంది. భావోద్వేగాలను స్క్రీన్‌పై బలంగా మలచడంలో ఎక్కడో లోటు కనిపిస్తుంది.

ముఖ్యంగా “ముట్టుకుంటే షాక్ కొడుతుంది” అనే కాన్సెప్ట్ అమలులో అసమంజసతలు కనిపిస్తాయి. కొన్ని సందర్భాల్లో ముట్టుకుంటే షాక్ రావడం, కొన్ని సందర్భాల్లో రాకపోవడం ఎందుకు జరుగుతుంది అనే విషయాన్ని స్పష్టంగా రిజిస్టర్ చేయడంలో సినిమా బలహీనంగా కనిపిస్తుంది. దామిని ఎప్పుడు ముట్టుకుంటే షాక్ వస్తుంది, ఎప్పుడు రాదు అనే లాజిక్‌ను ఇంకా క్లియర్‌గా చూపించి ఉంటే కథ మరింత బలపడేదనే భావన కలుగుతుంది.

నటీనటుల విషయానికి వస్తే, తిరువీర్ తనదైన నటనతో మరోసారి ఆకట్టుకున్నాడు. భార్యా బాధితుడైన భర్త పాత్రలో అతని మేనరిజం, ఈజ్ బాగా పనిచేశాయి. ఐశ్వర్య రాజేష్ గత తెలుగు చిత్రాలతో పోలిస్తే ఇది కొంచెం భిన్నమైన పాత్ర. నటనకు మంచి స్కోప్ ఉన్న ఈ పాత్రలో ఆమె మెప్పించింది. ఆమని, క్రాంతి బలివాడ, గవిరెడ్డి శ్రీనివాస్, జీవన్, మురళీధర్ గౌడ్ తదితరులు తమ తమ పాత్రల పరిధిలో సరైన న్యాయం చేశారు.

సాంకేతికంగా చూస్తే, భరత్ మాచిరాజు అందించిన పాటలు సినిమాకి అడ్డుగా అనిపించకుండా, కథ ప్రవాహంలో కలిసిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం చిత్రానికి ప్లస్ పాయింట్‌గా నిలిచింది. సినిమాటోగ్రఫీ కూడా గ్రామీణ వాతావరణాన్ని బాగా పట్టుకుని, సినిమాకి అదనపు బలం చేకూర్చింది. నిర్మాణ విలువలు సంతృప్తికరంగా ఉన్నాయి.

మొత్తానికి, ‘ఓ సుకుమారి’ ఆసక్తికరమైన షాకింగ్ కాన్సెప్ట్‌తో పాటు కొన్ని ఎంగేజింగ్ మూమెంట్స్ ఉన్నప్పటికీ, ప్రధాన ఘర్షణను బలంగా మలచలేకపోవడం, కాన్సెప్ట్ అమలులో స్పష్టత లోపించడం వల్ల పాక్షికంగా మాత్రమే ఆకట్టుకునే చిత్రంగా నిలిచింది.

రేటింగ్ 2.75/5

గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టికోణానికి సంబంధించినది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.