రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: ఇప్పటి వరకు వెండితెరపై విడుదలయ్యే సినిమాలకు మాత్రమే వర్తిస్తున్న సెన్సార్ నిబంధనలను, ఇకపై ఓటీటీ వేదికలపై విడుదలయ్యే సినిమాలకూ విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇటీవల ఓటీటీ కంటెంట్ చుట్టూ నెలకొన్న వివాదాలు, భద్రతా సంస్థల సూచనలు వంటి పరిణామాల నేపథ్యంలో ఈ దిశగా కేంద్రం అడుగులు వేస్తోందని తెలుస్తోంది.
ప్రస్తుతం ఓటీటీ కంటెంట్ నియంత్రణకు ఐటీ (డిజిటల్ మీడియా నైతిక నియమావళి) నిబంధనలు 2021 అమల్లో ఉన్నాయి. ఈ నిబంధనల ప్రకారం, ఓటీటీ ప్లాట్‌ఫార్మ్‌లలో ప్రసారం అయ్యే సినిమాలు, వెబ్ సిరీస్‌లకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) నుంచి సెన్సార్ సర్టిఫికేట్ అవసరం లేదు. ఈ నేపథ్యంలో థియేటర్లలో సెన్సార్ బోర్డు నిరాకరించిన, లేదా భారీ కట్స్ సూచించిన కొన్ని చిత్రాలను నేరుగా ఓటీటీ వేదికలపై విడుదల చేస్తున్న పరిస్థితి నెలకొంది.
ఇలాంటి విడుదలలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కొత్త విధానాన్ని పరిశీలిస్తోంది. ఇందుకోసం ప్రస్తుత నిబంధనల్లో మార్పులు చేసి, ఓటీటీ సినిమాలకూ ముందస్తు ధృవీకరణను తప్పనిసరి చేసే ప్రతిపాదనపై చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. ఈ ప్రతిపాదన అమల్లోకి వస్తే, థియేటర్లలో విడుదలయ్యే సినిమాల మాదిరిగానే, ఓటీటీ కోసం ప్రత్యేకంగా రూపొందించే సినిమాలు కూడా సెన్సార్ ప్రక్రియను పూర్తి చేయాల్సి రావచ్చు.
కేవలం సినిమాలకే పరిమితం కాకుండా, భవిష్యత్తులో వెబ్ సిరీస్‌లను కూడా ఈ పరిధిలోకి తీసుకురావాలా లేదా అనే అంశంపై కూడా ప్రభుత్వం అంతర్గతంగా చర్చిస్తున్నట్లు తెలిసింది. ఓటీటీ వేదికలపై ప్రసారం అవుతున్న కంటెంట్ సామాజిక, మత, జాతీయ భద్రతా అంశాలపై ప్రభావం చూపుతున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, సమగ్ర నియంత్రణ వ్యవస్థ అవసరమని అధికార వర్గాలు భావిస్తున్నాయని సమాచారం.
ఇటీవల దిల్జింత్ దొసాంజే నటించిన ‘సత్లుజ్’ చిత్రం చుట్టూ నెలకొన్న వివాదం ఈ చర్చలకు మరింత ఊపునిచ్చింది. ఆ చిత్రానికి సెన్సార్ బోర్డు భారీ కట్స్ సూచించగా, చిత్రబృందం ఆ సూచనలను అంగీకరించకుండా, ఎలాంటి మార్పులు చేయకుండా నేరుగా ఓటీటీ వేదికపై విడుదల చేసింది. అయితే దేశ భద్రతా పరమైన ఆందోళనల నేపథ్యంలో, ఆ చిత్రం విడుదలైన రెండురోజుల్లోనే ఓటీటీ నుంచి తొలగించబడిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో, థియేటర్లలో గానీ, ఓటీటీ వేదికలపై గానీ ప్రజల ముందుకు వచ్చే ఆడియో–విజువల్ కంటెంట్ అన్నింటికీ ఒకే విధమైన నియంత్రణ వ్యవస్థ ఉండాలనే అభిప్రాయం కేంద్రంలో బలపడుతున్నట్లు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే ప్రతిపాదిత మార్పులపై ఓటీటీ సంస్థలు, సినీ పరిశ్రమ ప్రతినిధులతో ప్రభుత్వం ఇంకా సంప్రదింపులు కొనసాగిస్తున్నందున, తుది రూపురేఖలు వెలువడేందుకు కొంత సమయం పట్టే అవకాశముంది.







