‘వారణాసి’ కోసం 14 నెలలుగా పనిచేస్తున్నాను: ప్రియాంక చోప్రా

దర్శకుడు ఎస్‌.ఎస్‌.రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ‘వారణాసి’పై కథానాయిక ప్రియాంక చోప్రా తాజా వ్యాఖ్యలు చేశారు. మహేశ్ బాబు హీరోగా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రియాంక ‘మందాకిని’ పాత్రలో నటిస్తున్నారు. ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఈ సినిమా కోసం చేస్తున్న తన కృషి గురించి వివరించారు.

‘‘నేను 14 నెలలుగా ఈ సినిమా కోసం పనిచేస్తున్నాను. సినిమాను తెరకెక్కించడానికి రాజమౌళి చాలా సమయం తీసుకుంటారనే సంగతి మనందరికీ తెలిసిందే. ప్రతి సన్నివేశాన్ని క్షుణంగా పరిశీలిస్తారు. ఈ సినిమాలో నేను అద్భుతమైన స్లో మోషన్ జంప్స్ చాలా చేశాను. ప్రస్తుతానికి నేనింతకంటే ఎక్కువ చెప్పలేను’’ అని ప్రియాంక చోప్రా తెలిపారు.

ఇంతకుముందు కూడా ‘వారణాసి’ గురించి ప్రియాంక మాట్లాడారు. తాను ఇప్పటివరకు చేసిన సినిమాలకు ఇది పూర్తిగా భిన్నమైనదని ఆమె పేర్కొన్నట్లు సమాచారం. రాజమౌళి శైలికి అనుగుణంగా ఈ చిత్రంలో యాక్షన్‌, భావోద్వేగాలకు సమాన ప్రాధాన్యం ఉంటుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తయిందని రాజమౌళి వెల్లడించారు. అక్టోబర్‌ నాటికి మొత్తం షూటింగ్‌ ముగించేలా ప్రణాళికలు వేసినట్లు ఆయన తెలిపారు. అనంతరం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు ప్రారంభించి, వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నుంచి ప్రమోషన్‌ కార్యక్రమాలు మొదలుపెట్టే అవకాశం ఉందని పేర్కొన్నారు.

‘వారణాసి’ చిత్రాన్ని ఏప్రిల్‌ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయడానికి చిత్రబృందం సిద్ధమవుతోంది. మహేశ్ బాబు కెరీర్‌లో కీలక మైలురాయిగా నిలిచే చిత్రంగా ఈ ప్రాజెక్ట్‌ను పరిశ్రమ వర్గాలు చూస్తున్నాయి. రాజమౌళి దర్శకత్వం, మహేశ్ బాబు నటన, ప్రియాంక చోప్రా పాత్రపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం చిత్ర యూనిట్‌ విదేశీ లొకేషన్లు, భారీ సెట్లలో మిగతా సన్నివేశాల చిత్రీకరణకు సిద్ధమవుతోంది. షూటింగ్‌ పూర్తయిన తర్వాత విజువల్‌ ఎఫెక్ట్స్‌, బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, ఇతర సాంకేతిక పనులకు ఎక్కువ సమయం కేటాయించనున్నట్లు సమాచారం. ‘వారణాసి’ విడుదల తేదీ ప్రకటించడంతో, తెలుగు సహా భారతీయ సినీ ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై ఆసక్తి మరింత పెరిగింది.