ప్రముఖ హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘రాగిణి’ మూడో భాగం అధికారికంగా ప్రారంభమైంది. ఎంతో కాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న ‘రాగిణి 3’ చిత్రీకరణ తాజాగా మొదలైంది. కొత్త తారాగణం, సరికొత్త సృజనాత్మక బృందంతో రూపొందుతున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

సినిమా కథాంశం, ప్రధాన ప్లాట్ వివరాలను మేకర్స్ గోప్యంగా ఉంచుతున్నప్పటికీ, షూటింగ్ ప్రారంభోత్సవానికి సంబంధించిన తాజా సమాచారం సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. ప్రత్యేకంగా హీరోయిన్ తమన్నా భాటియా సెట్స్‌లో చేరిన విషయంపై సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో తమన్నా భాటియా కీలక పాత్రలో నటించనున్నారు. తాజాగా ఆమె తన ఇంస్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా షూటింగ్ సెట్ నుంచి ఒక ఫోటోను అభిమానులతో పంచుకున్నారు. అందులో ఆమె “ డే 01” అని రాసి ఉన్న క్లాప్‌బోర్డ్‌ను పట్టుకుని కనిపించారు. ఈ ఫోటో వెలుగులోకి రావడంతో తమన్నా ఈ ప్రాజెక్టులో భాగమైందన్న విషయం అధికారికంగా ధృవీకరించబడింది.

గత భాగాలకు భిన్నంగా ‘రాగిణి 3’ను దర్శకుడు శశాంక ఘోష్ తెరకెక్కిస్తున్నారు. సూపర్ నేచురల్ హారర్, సస్పెన్స్ అంశాల కలయికతో ఈ చిత్రాన్ని మరింత ఉత్కంఠభరితంగా రూపొందిస్తున్నట్లు చిత్ర యూనిట్ వర్గాలు సూచిస్తున్నాయి. హారర్ జానర్‌లో కొత్త ప్రయోగాలకు అవకాశం ఉన్న కథతో ఈ సినిమా ముందుకు వస్తోందని సమాచారం.