రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో రెపరెపలాడించిన దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి విశ్వ వేదికపై మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఫ్రాన్స్‌లోని ప్రతిష్ఠాత్మక లూమియర్ మ్యూజియంలో ఆయన పేరు చిరస్థాయిగా నిలిచేలా ప్రత్యేక సత్కారం లభించింది. ప్రపంచ సినిమా చరిత్రలో కీలక స్థానాన్ని దక్కించుకున్న ఈ మ్యూజియంలో భారతీయ దర్శకుడిగా రాజమౌళి పేరు వెలిగిపోవడం సినీ వర్గాల్లో గర్వకారణంగా మారింది.
ఇటీవల రాజమౌళి లూమియర్ మ్యూజియాన్ని సందర్శించారు. అక్కడ ‘ఈగ’, ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్రాల్ని ప్రదర్శించిన ప్రత్యేక స్క్రీనింగ్ రూమ్‌ను కూడా ఆయన పరిశీలించారు. ఈ సందర్శన సందర్భంగా Cannes Film Festival డైరెక్టర్ థియరీ ఫ్రేమో స్వయంగా రాజమౌళిని ఆహ్వానించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయనకు ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చారు.
మార్టిన్ స్కోర్సెసీ, క్లింట్ ఈస్ట్‌వుడ్, క్వెంటిన్ టరంటినో వంటి ప్రపంచ ప్రఖ్యాత లెజెండరీ దర్శకుల నేమ్ బోర్డులు అమర్చిన ప్రతిష్ఠాత్మక ‘మ్యూర్ డే సినియాస్ట్’ (Film Makers Wall) వద్దకు రాజమౌళిని తీసుకెళ్లారు. అక్కడ ఎర్రటి వస్త్రంతో కప్పి ఉన్న ఒక ఫలకాన్ని తెరిచేలా ఆయనను ఆహ్వానించారు. ఆ ఫలకాన్ని ఓపెన్ చేయగానే ప్రపంచ సినిమా దిగ్గజాల పేర్ల సరసన రాజమౌళి పేరు కూడా సగర్వంగా మెరిసింది.
ఈ చారిత్రక క్షణం రాజమౌళిని భావోద్వేగానికి గురి చేసింది. ఇది తనకు జీవితాంతం గుర్తుండిపోయే జ్ఞాపకమని, ఈ గౌరవాన్ని మరువలేనని ఆయన సామాజిక మాధ్యమాల ద్వారా ఆనందం వ్యక్తం చేశారు. ప్రపంచ సినీ చరిత్రలో కీలక మైలురాయిగా భావించే ఈ గోడపై తన పేరు నిలవడం ఎంతో గౌరవంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
సినిమాను కనిపెట్టిన Lumière Brothers జ్ఞాపకార్థం ఫ్రాన్స్‌లోని లియాన్ నగరంలో లూమియర్ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. సినిమా పుట్టుక, పరిణామం, అభివృద్ధి దశలను ప్రతిబింబించే అరుదైన పత్రాలు, పరికరాలు, చిత్రాలతో ఈ మ్యూజియం ప్రపంచ సినీ చరిత్రకు ఒక పవిత్ర స్థలంగా భావించబడుతోంది. అలాంటి ప్రదేశంలో హాలీవుడ్ క్లాసిక్ లెజెండ్స్ పేర్లు ఉన్న గోడపైనే భారతీయ దర్శకుడిగా రాజమౌళి పేరు శాశ్వతంగా నిలిచిపోవడాన్ని భారతీయ చలనచిత్ర పరిశ్రమ గర్వంగా అభివర్ణిస్తోంది.
తెలుగు సినిమా సృజనాత్మకత, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన దర్శకుడిగా రాజమౌళి ఇప్పటికే అనేక అంతర్జాతీయ వేదికలపై ప్రశంసలు అందుకున్నారు. ఇప్పుడు లూమియర్ మ్యూజియంలో లభించిన ఈ అరుదైన గౌరవం ఆయన వ్యక్తిగత విజయంతో పాటు భారతీయ సినీ ప్రపంచానికి కూడా ఒక మైలురాయిగా సినీ వర్గాలు భావిస్తున్నాయి.







