రాయలసీమ న్యూస్, ఎంటర్టైన్మెంట్ డెస్క్: బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘మాతృభూమి’ చిత్రం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ప్రకటించిన నాటి నుంచే వార్తల్లో నిలుస్తున్న ఈ సినిమా విడుదలపై తాజా పరిణామాలు సినీ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నాయి.
ఆగస్టులో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్రబృందం భావిస్తున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు క్లియరెన్స్ సర్టిఫికెట్‌ను ప్రస్తుతం హోల్డ్‌లో పెట్టినట్లు సమాచారం. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ నుంచి తుది అనుమతి ఆలస్యమవడంతో విడుదల తేదీపై అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది.
ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ‘మాతృభూమి’ విడుదల కావాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఆ సమయంలోనే వాయిదా పడింది. ఇప్పుడు సెన్సార్ బోర్డు నుంచి ఎదురైన తాజా అడ్డంకితో సినిమా విడుదల మరింత ఆలస్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.
ఈ చిత్రంలో ‘చైనా’ అనే పదాన్ని ఉపయోగించవద్దని గతంలో బోర్డు సూచించడంతో, కొన్ని సన్నివేశాలను రీషూట్ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. రీషూట్ పూర్తయిన తర్వాత కూడా సర్టిఫికెట్‌ను హోల్డ్‌లో పెట్టడం ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
దీనిపై ఇప్పటి వరకు చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో త్వరలోనే మేకర్స్ కొత్త విడుదల తేదీని ప్రకటించే అవకాశం ఉన్నట్లు సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
భారత్–చైనా మధ్య 2020లో జరిగిన గల్వాన్ ఘర్షణల ఆధారంగా ఈ సినిమాను రూపొందించిన విషయం తెలిసిందే. తొలుత దీనికి ‘బ్యాటిల్ ఆఫ్ గల్వాన్’ అనే శీర్షికను ఖరారు చేశారు. అనంతరం దాన్ని ‘మాతృభూమి’గా మార్చుతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
మరోవైపు, భారత రక్షణ మంత్రిత్వశాఖ సూచనల మేరకు దర్శకుడు అపూర్వ లఖియా ఈ ప్రాజెక్టులో భారీ స్థాయిలో మార్పులు చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఆ మార్పుల భాగంగా దాదాపు 40 శాతం సినిమాను రీషూట్ చేసినట్లు సమాచారం.
సినిమా కథలో కొన్ని కల్పిత అంశాలను, రొమాంటిక్ సన్నివేశాలను, బ్యాక్‌గ్రౌండ్ కథను అదనంగా జోడించి కొత్త వెర్షన్‌ను సిద్ధం చేసినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్పులన్నీ పూర్తయ్యాక కూడా సెన్సార్ ప్రక్రియలో ఆలస్యం కావడం వల్ల ‘మాతృభూమి’ విడుదల ఎప్పుడన్నది ఇప్పుడు అభిమానుల్లో ప్రశ్నగా మారింది.







